ప్రజాశక్తి-వాల్మీకిపురం: అంగన్‌వాడీ కేంద్రాల్లోని గర్భవతులు, బాలింతలు, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ధనలక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని జర్రావారిపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్ర పరిధిలోని గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలన్నారు. ప్రతి రోజు పాలు, గుడ్లతో పాటు భోజనాన్ని అందించాలన్నారు. నిత్యం గర్భవతులకు కాల్షియం, ఐరన్ మాత్రలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లల బరువు, ఎత్తు పరిశీలించాలని, కాన్పులన్నీ ప్రభుత్వాసుపత్రిల్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గర్భవతులకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిడిపిఒ భారతి, ఎంఎల్‌హెచ్‌పి మౌనిక, వైసిపి నాయకులు ఆనంద, చంద్రశేఖర్, రవి, గర్భవతులు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.










