Jun 23,2023 21:56

ఫొటో : తహశీల్దారు మాధవరెడ్డితో మాట్లాడుతున్న మాలేపాటి సుబ్బానాయుడు

గ్రావెల్‌ తరలింపు ఆపేంతవరకూ పోరాటం
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గంలో అక్రమంగా తరలిపోతున్న గ్రావెల్‌ను ఆపేంత వరకు నిద్ర పోయేదిలేదని, అధికారులు స్పందించక పోతే టిడిపి కార్యకర్తలతో వచ్చి, పోరాటం చేస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో కావలి పట్టణ, రూరల్‌ మండల టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. తహశీల్దారు మాధవరెడ్డి సిఎం సెట్‌ కాన్ఫరెన్స్‌లో ఉండి, కార్యాలయంలో లేకుండా పోయారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దారు జూలియబాయి వచ్చి, టిడిపి అభ్యర్థన ఏమిటో తనకు వినతిపత్రం ఇస్తే, తాను వారి విన్నపాన్ని తహశీల్దారుకు తెలియజేస్తానన్నారు.
అందుకు టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహశీల్దారు వచ్చే వరకు కార్యాలయాన్ని విడిచి వెళ్లేది లేదన్నారు. గ్రావెల్‌ మాఫియాను అరెస్టు చేయాలి.. రెవెన్యూ అధికారులకు పట్టదా.. అవినీతిలో ఎవరి వాటా ఎంత.. సిఎం డౌన్‌డౌన్‌.. ఎంఎల్‌ఎ డౌన్‌డౌన్‌.. అంటూ టిడిపి శ్రేణుల నినాదాలతో తహశీల్దార్‌ కార్యాలయం మారుమోగింది. ఎంతసేపైనా తహశీల్దార్‌ రాకపోవడంతో.. పోలీసులు మోహరించడంతో.. కావలి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్బంగా తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో వంటావార్పు కార్యక్రమం చేపట్టి, కార్యాలయ ఆవరణంలోనే మాలేపాటితో టిడిపి నాయకులు, కార్యకర్తలు తాము వండి, వార్చుకున్న భోజనాలు పూర్తి చేశారు. తహశీల్దార్‌కు మాత్రమే అర్జీని సమర్పిస్తానని, మాలేపాటి మొండిపట్టు పట్టారు. చివరికి తహశీల్దార్‌. మాధవరెడ్డి కార్యాలయానికి వచ్చారు. సమస్యను క్షుణ్ణంగా తహశీల్దార్‌కి మాలేపాటి తెలియజేశారు. గ్రావెల్‌ మాఫియాను ఆపకుంటే మళ్లీమళ్లీ తమ కార్యాలయానికి వచ్చి, ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గ్రావెల్‌ విషయంపై అధికారులందరినీ కలవడం జరిగిందని, మీరైనా తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు జ్యోతి బాబురావు, గుత్తికొండ కిషోర్‌ బాబు, ఆత్మకూరు నాగరాజు, బొట్లగుంట శ్రీహరి నాయుడు, ఉప్పాల శ్రీను, అన్నపూర్ణ శ్రీను, అమరావతి జ్యోతి, పట్టణ, రూరల్‌ నాయకులు పాల్గొన్నారు.