May 22,2023 21:52

ఫొటో : ఆర్‌.డి.ఒ. వి.కె.శీనా నాయక్‌కు వినతి పత్రం అందజేసి, మాట్లాడుతున్న సుబ్బా నాయుడు

గ్రావెల్‌ మాఫియాపై మాలేపాటి ధ్వజం
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గంలో అడూఅదుపు లేకుండా జరుగుతున్న గ్రావెల్‌ మాఫియాపై చర్యలు ఎందుకు చేపట్టడం లేదంటూ కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సోమవారం అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి, టిడిపి కార్యాలయం నుండి కావలి రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్‌డిఒ వి.కె.శీనా నాయక్‌ను కలిసి కావలిలో జరుగుతున్న గ్రావెల్‌ అక్రమ రవాణా గురించి వివరించారు. తాను ప్రజల పక్షాన ఈ సమస్యపై పోరాడేందుకు, తమకు ఈ విషయాన్ని తెలియజేసేందుకు వచ్చానని త్వరితగతిన దీనిపై చర్యలు తీసుకొని నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరారు.
అలాగే ఈ గ్రావెల్‌ మాఫియా గురించి మైనింగ్‌ అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించేంత వరకు తాను ఇక్కడి నుంచి వెళ్లనని ఆర్‌డిఒ ఆఫీస్‌ ఎదుట బైఠాయించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అధికార వై.సి.పి నాయుకులు చేస్తున్న గ్రావెల్‌, మట్టి, ఇసుక సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతుందని పత్రికా విలేకరుల సమక్షంలో తెలిపారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. కావలి మండలంలోని రుద్రకోటలో 100 అడుగుల లోతు వరకు మట్టి తవ్వి, రాత్రింబవళ్లు వందలాది టిప్పర్లు, పదికి పైగా జె.సి.బి.లతో అక్రమంగా తరలిస్తున్నారని ఈ విషయాలన్నీ అధికారులకు తెలియదా.. అని ప్రశ్నించారు. బోగోలు మండలంలో కూడా ఇదేపరిస్థితి కొనసాగుతుందని, ఈ ఆగడాలను అక్రమ కార్యక్రమాలను నిలువరించాల్సిన అధికార యంత్రాంగం, మైనింగ్‌ డిపార్ట్మెంట్‌, చోద్యం చూస్తుందని విమర్శించారు. కావలి నియోజకవర్గంలో జరుగుతున్న గ్రావెల్‌ మాఫియా అక్రమాలపై ప్రతి నిత్యం పేపర్లు, టీవీలలో వస్తున్న భాద్యత గల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఈ మాఫియా గుట్టురట్టు తేల్చేంత వరకు తాను ప్రజల పక్షాన ఉంటూ నిరంతరం పోరాటం చేస్తానని తెలియజేశారు. అనంతరం ఆర్‌డిఒ వి.కె.శీనా నాయక్‌కు కావలి నియోజకవర్గంలో జరుగుతున్న గ్రావెల్‌ మాఫియాను అడ్డుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మన్నవ రవిచంద్ర, పోతుగంటి శ్రీకాంత్‌, దావులూరు దేవకుమార్‌, అక్కిలిగుంట సూర్యప్రకాష్‌ రావు, జ్యోతి బాబురావు, ఉప్పుటూరు బాలగురు స్వామి, శానం హరి, తదితరులు పాల్గొన్నారు.