ప్రజాశక్తి - చిలమత్తూరు : మండలంలోని కోడూరు,శెట్టిపల్లి రెవెన్యూ పొలాలలో గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం రైతుల నుండి సేకరిస్తున్న భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని సర్పంచి ఈడిగ మురళి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కోడూరు సచివాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో భూములు కోల్పోయిన రైతులు రైతు సంఘం నాయకులు అధికారుల తీరును తప్పు పట్టారు. పాత గెజిట్ ప్రకారం భూములు కేటాయించకుండా బయోటెక్ పరిశ్రమకు మేలు చేసేలా వ్యవహరిస్తూ సామన్య రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు ఉంటేనే సామాన్య రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో ఈ గ్రామ సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తహశీల్దార్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా రైతులు వినలేదు. రైతుల ఆందోళనకు వైసిపి సర్పంచి మురళి కూడా మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నాగరాజు, వీఆర్వో రాజేష్, కార్యదర్శి నాగరాజు, వైస్ ఎంపిపి అంజలీదేవి తదితరులు పాల్గొన్నారు.










