1936 ఏప్రిల్ 11వ తేదీన అఖిల భారత కిసాన్‌సభ ఏర్పడింది. ఆ నాటికే దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్రిటీష్ ప్రభుత్వ జమీందారుల దోపిడీలకు, నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలన్నీ లక్నోలో సమావేశమై అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్)ను ఏర్పరిచాయి. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాలని, జమీందారీ విధానం రద్దు కోసం పోరాడాలని, రైతాంగంపై సాగుతున్న ఆర్థిక, సాంఘిక దోపిడీలకు, పీడనలకు వ్యతిరేకంగా పోరాడాలని ఎఐకెఎస్ పిలుపు ఇచ్చింది.
ఎఐకెఎస్ ఏర్పడిన నాటి నుండి దేశం నలుమూలలా రైతాంగాన్ని స్వాతంత్య్రోద్యమం లోకి సమీకరించింది. స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. జమీందారుల పాలనలో రైతాంగం, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు గురవుతున్న దోపిడీలకు, వెట్టిచాకిరికి, రుణ బానిసత్వానికి అంతులేని కౌెలు దోపిడీలకు, వడ్డీ దోపిడీలకు వ్యతిరేకంగా దేశం నలుమూలలా పోరాటాలు సాగించింది. ఆంధ్రలో ఇచ్చాపురం నుండి తడ వరకు సాగిన రైతు రక్షణ యాత్ర జరిపింది. కొనసాగింపుగా రాష్ట్ర వ్యాపింతంగా జమీందారీ వ్యతిరేక పోరాటాలు సాగాయి. మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ రైతుల రుణవిముక్తి పోరాటం, బెంగాల్‌లో విపరీతమైన కౌలు దోపిడీలకు వ్యతిరేకంగా తెబాగా పోరాటం, కేరళలో పున్నప్ర వాయలార్ పోరాటం, త్రిపురలో గణముక్తి పరిషత్ పోరాటం, సుర్మా వ్యాలీలో నంకర్ పోరాటాలు జరిగాయి. ఇవన్నీ సుదీర్ఘ కాలంపాటు నిర్బంధాలను ప్రతిఘటించి ప్రాణ త్యాగాలతో సాగాయి. అంతిమంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది. ఫలితంగా బ్రిటిష్ పాలనతో పాటు జమీందారీ పాలన అంతమయ్యింది
స్వాతంత్య్రానంతరం నాగార్జున సాగర్ తదితర సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎఐకెఎస్ పోరాడింది. మిగులు భూముల, బంజరు భూముల పంపిణీ కోసం, కౌలురైతుల బేదఖళ్ళకు వ్యతిరేకంగా, అధిక శిస్తులకు, బెటర్‌మెంట్ టాక్సులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగించింది. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కోసం 1980-81లో దేశవ్యాపిత పోరాటాలు సాగించింది. 1981 మార్చి 17న అనేక నిర్బంధాల మధ్య ఢిల్లీలో 10 లక్షల మందితో ర్యాలీ నిర్వహించింది. 1987లో రైతుల, వ్యవసాయ కార్మికుల సమస్యలపై దేశవ్యాపిత సత్యాగ్రహాలు నిర్వహించింది. దేశం లోని ఆరు ప్రాంతాల నుండి ఆరు జాతాలు నిర్వహించి 1987 డిసెంబర్ 9న ఢిల్లీలో 10 లక్షల మందితో ప్రదర్శన నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయ భూముల సాగుదార్ల హక్కుల కోసం, కౌలురైతుల హక్కుల కోసం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ఉద్యమాలు సాగించి ఫలితాలు సాధించింది.
సరళీకరణ విధానాల నేపథ్యంలో డంకెల్ డ్రాఫ్ట్‌కు వ్యతిరేకంగా ఎఐకెఎస్ దేశవ్యాపితంగా ప్రచారం నిర్వహించింది. రైతాంగ ఆత్మహత్యలను వెలికితీసింది. స్వతంత్రంగా కమిషన్ వేసి విచారణ జరిపించింది. ఈ నేపథ్యంలోనే రైతుల జాతీయ కమిషన్ ఏర్పడింది. డా|| యమ్.ఎస్. స్వామినాథన్ కమిషన్ సూచించిన విధంగా సి2+50 పంటల మద్దతు ధరల విధానాల అమలు కోసం దేశవ్యాపితంగా ఆందోళనలు చేపట్టింది. 2014 ఎన్నికలలో ఇది ప్రధాన ఎజెండాగా మారింది. స్వామినాథన్ కమిషన్ సూచనల ప్రకారం మద్దతు ధరలు అమలు పరుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బి.జె.పి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని, స్వామినాథన్ సూచన ప్రకారం గిట్టిబాటు ధరలు అమలుకు చట్టం, రుణగ్రస్తమైన రైతాంగాన్ని కాపాడడానికి రుణ విమోచన చట్టం చేయాలనే ప్రధానమైన రెండు డిమాండ్లపై 207 సంఘాలతో అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర వహించింది.
ఈ కాలంలో రాజస్థాన్‌లో సాగునీటి కోసం దీర్ఘకాలం సాగిన ఉద్యమం మంచి ఫలితాలు సాధించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాందసార్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరిపి ఆరుగురు రైతుల ప్రాణాలు బలిగొన్నది. ఈ సమస్యపై ఎఐకెఎస్ చూపిన చొరవ కొత్త సంబంధాలకు దారి తీసింది. 2019లో నాసిక్ నుండి ముంబైకి జరిపిన మహా పాదయాత్ర రైతాంగ ఉద్యమాలకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఈ కాలంలో కిసాన్ సభ నిర్వహించిన భూఅధికార్ ఆందోళన, జన్ ఏక్తా జన్ ఆందోళన కార్యక్రమాలు రైతు సంఘాల వ్యవసాయ కార్మిక సంఘాల, కార్మిక సంఘాల ఐక్యతకు దారితీసింది.
దేశం యావత్తు కరోనా ప్రభావంతో సతమతమవుతుండగా బి.జె.పి ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి మూడు వ్యవసాయ నల్లచట్టాలను తెచ్చింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ముందు పీఠిన నిలవడమే కాకుండ మొత్తం 540 సంఘాలను ఏకతాటి పైకి తెచ్చి ఏడాదిపాటు ఉద్యమాన్ని సాగించడంలోనూ, ఉద్యమాన్ని దేశం నలుమూలలకూ విస్తరింపజేయడంలో ఎఐకెఎస్ ప్రధాన పాత్ర వహించింది. కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన మద్దతు ధరల చట్టంతో పాటు ఇతర హామీలను అమలుపరచుకోవలసి ఉంది. అందుకు మరింత తీవ్రమైన పోరాటానికి సన్నద్ధం కావలసి ఉంది. ఈ పరిస్ధితుల్లో అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భవించిన ఏప్రియల్ 11న గ్రామగ్రామాన ఎ.ఐ.కె.ఎస్ పతాకావిష్కరణలు, సభలు, ప్రదర్శనలు జరపాలని పిలుపు ఇచ్చింది. ప్రతి గ్రామంలో రైతుసంఘం ప్రతి రైతు రైతు సంఘంలో చేరాలని పిలుపు ఇచ్చింది. ఏప్రియల్ 11 నుండి 17 వరకు గిట్టుబాటు ధరల చట్టం కోసం గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించాలని సంయుక్త కిసాన్ సభ ఇచ్చిన పిలుపును జయప్రదం చేయడం ద్వారా గిట్టుబాటు ధరల చట్టం కోసం రెండవ దశ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవలసి ఉంది.
(వ్యాసకర్త : ఎ.పి రైతు సంఘం అధ్యక్షుడు )
వై. కేశవరావు











