గొర్రెల పెంపక క్షేత్రం స్థలంలో టౌన్‌షిప్ ఏర్పాటు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
ప్రజాశక్తి -పెనుకొండ : గొర్రెల పెంపక క్షేత్రం స్థలంలో జగనన్న స్మార్ట్ సిటీ టౌన్ షిప్ ఏరాపటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వ్యకాసం, సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు వారు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, సిపిఎం మండల కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ గొర్రెల పెంపక క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తూ గొర్రెల వృత్తిదారులను కాపాడాలని కోరారు. పెనుకొండ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ గొర్రెల పెంపకం క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. గొర్రెల పెంపక క్షేత్రాన్ని సంబంధించిన భూమిలో ఇప్పటికే మెడికల్ కాలేజీ కోసం 50 ఎకరాల భూమిని కేటాయించారని దీంతో పాటు జగనన్న స్మార్ట్ సిటీ టౌన్‌షిప్ పేరుతో లేఅవుట్ అనుమతులు ఇస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గొర్రెల వత్తిదారులను మోసం చేస్తూ 60 ఎకరాల భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వం తన ఆలోచనలను విరమించుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గంగాధర్, వెంకటరాముడు, సిఐటియు నాయకులు తిప్పన్న, రెడ్డప్ప రెడ్డి, నాగప్ప, మురళి తదితరులు పాల్గొన్నారు.










