Dec 18,2021 06:49

వ్యవసాయ చట్టాలను మోడీ ఎందుకు, ఎలా వెనక్కు తీసుకున్నారనే విషయం గురించి ఏ ఒక్క చానల్‌ కూడా విశ్లేషించే ప్రయత్నం చేయలేదు. తన పార్టీ ఎన్నికల్లో సాధించే విజయాలను, పార్టీ రాజకీయాలను కూడా లెక్క చేయకుండా చట్టాలను రద్దు చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడుగా మోడీని చూపే ప్రయత్నం చేశాయి చానళ్లు. వ్యవసాయ చట్టాలను ఇంతకు ముందే ఎందుకు రద్దు చేయలేదు? లేదా ప్రధానమంత్రి చట్టాల రద్దు నిర్ణయానికి ముందు రైతులతో ఒక సమావేశాన్ని కూడా ఎందుకు ఏర్పాటు చెయ్యలేదు? వంటి ఇరుకున పెట్టే ప్రశ్నలను ఏ ఒక్క యాంకర్‌ కూడా అడగలేదు.

     ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం సామాన్య ప్రజానీకాన్ని మాత్రమే కాక ఎలక్ట్రానిక్‌ మీడియాను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మీడియాకు చెందిన అనేకమంది, ప్రధానికి సన్నిహితంగా ఉన్నట్లు, ఆయన చేసిన గొప్ప పనులు తమకు ముందే తెలుసని చెప్పుకున్నారు. కానీ వ్యవసాయ చట్టాలకు సంబంధించి, మోడీ ఏం చేయనున్నారనే విషయంలో మాత్రం ఎవరికీ ఏ సందేహం కలగలేదు. టైమ్స్‌ నౌ, రిపబ్లిక్‌ భారత్‌, ఇండియా టీవీ, జీ టీవీ, ఆజ్‌ తక్‌...లాంటి చానళ్ళకు చెందిన ప్రముఖ యాంకర్లకు వ్యవసాయ చట్టాల రద్దు గురించి మాత్రమే కాక, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో జరుగబోయే ఎన్నికల మీద చట్టాల రద్దు ఎటువంటి ప్రభావాలను చూపుతుందనేది సూచన ప్రాయంగా కూడా తెలియదు.
నవంబర్‌ 26, 2020 నుండి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చనిపోయిన 700 మంది రైతు కుటుంబాలతో మాట్లాడాల్సిన అవసరముందని కూడా ఈ మీడియా ప్రముఖులెవరికీ తట్టలేదు. రైతులు దేశ రాజధానికి చేరకుండా టియర్‌ గ్యాస్‌, నీటి ఫిరంగులు వదలడం, రోడ్ల మీద మేకులు నాటించడం, పోలీస్‌ బారికేడ్లతో అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భాలను గుర్తు చేసుకోవాలని వీరెవరికీ అనిపించలేదు. చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌ చేస్తూ, 11 విడతలుగా వివిధ కేంద్ర మంత్రులతో చర్చలు జరిపే సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనం చేయనంతటి దృఢ నిశ్చయంతో రైతులు ఎలా ఉన్నారనే విషయం గురించి ఏ ఒక్క మీడియా ప్రతినిధి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆసక్తికరంగా, 700 మంది రైతులు ప్రాణాలను కోల్పోయి, సుదీర్ఘకాలం పాటు నిరసనలు తెలిపినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ ఏ ఒక్క రైతుతో మాట్లాడలేదు. రైతుల మరణాల పట్ల సానుభూతిని కూడా వ్యక్తం చేయలేదు.
     ఒక్క ఎన్‌.డి టీవీ ఇండియా మినహాయించి... ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపడంలో ఎలక్ట్రానిక్‌ మీడియా విఫలమైంది. ఆ పని చేయడానికి బదులుగా, మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనుకున్న గురునానక్‌ జయంతి రోజున, దాదాపుగా అన్ని చానళ్లు, జాతి ప్రయోజనాలను దష్టిలో ఉంచుకొని వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఏ విధంగా రద్దు చేసింది, తన వ్యక్తిగతమైన, పార్టీ ప్రయోజనాలను కూడా కాదని ఒక నిజమైన దేశ భక్తునిగా, రాజనీతిజ్ఞుడుగా నరేంద్ర మోడీ ఎలా నిరూపించుకున్నాడనే ప్రభుత్వ కథనాలను ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. దేశ చరిత్రలో మొదటిసారిగా భారతదేశం ఒక సమర్థుడైన ప్రధానమంత్రిని కలిగి ఉందని 'రిపబ్లిక్‌ భారత్‌' యాంకర్‌ ఒకరు అత్యుత్సాహంతో పేర్కొన్నారు.
     జాతినుద్దేశించి మోడీ ప్రసంగించిన కొద్ది గంటల తర్వాత, న్యూస్‌ చానళ్ళ యాంకర్లకు, ప్రధాని నిర్ణయం పట్ల ఏం మాట్లాడాలో తెలియలేదు. ప్రభుత్వ కథనాన్ని నిస్సిగ్గుగా బలపరిచిన తీరును దాచడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వారి స్వరాలలో సహజమైన విశ్వాసం, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి చేసిన వారి ప్రయత్నాలలో నమ్మకం కొరవడినట్లు అనిపించింది.
    ''మీరు చట్టాలను ప్రవేశ పెట్టినపుడు, మా జర్నలిస్టు సోదరులందరం...చట్టాలలో ఉండే మంచి గురించి వివరించే ప్రయత్నం చేశాం. ఇప్పుడు మీరు మమ్ముల్ని చాలా నిరుత్సాహానికి గురి చేశారు. కొంతమంది ప్రజలు ఆర్టికల్‌ 370 కావాలని కోరుతున్నారని, మీరు ఆ ఆర్టికల్‌ రద్దును కూడా వెనక్కి తీసుకుంటారా?'' అని సత్య చానల్‌ కార్యక్రమాలను పరిచయం చేసే సుశాంత్‌ సిన్హా అన్నారు. ప్రేక్షకులకు తన ముఖాన్ని చూపించలేని అసమర్థతను వ్యక్తం చేస్తున్న అతని ట్వీట్లు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అతని బాధ స్పష్టంగా కనిపించింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం ద్వారా తప్పు చేసి, ఎన్నో ఆశలు పెట్టుకున్న తనకిష్టమైన రాజకీయ నాయకుడు మోడీ తనను మోసం చేసినట్టు ఆయన భావించారు. ''బిజెపి ఏమీ సాధించదని రాసిస్తాను, ఇది మీ (ప్రధాన మంత్రి) ప్రతిష్టకు ప్రమాదకరం' అని తన విచారాన్ని వ్యక్తం చేశారు.
 

                                                                       ప్రచార బాకాలు

రిపబ్లిక్‌ చానల్‌ ప్రసారం చేసే ''ఆన్‌ ద డిబేట్‌ ఎట్‌ 9''లో ఆర్ణబ్‌ గోస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ''వ్యవసాయ చట్టాలను ఒక సాధనంగా ఉపయోగించి దేశాన్ని నాశనం చేయాలనుకున్న కొన్ని శక్తులకు ఇప్పుడేమీ లేకుండా పోయింది. దాడులను సహించేది లేదు. రోడ్ల దిగ్బంధనం చేస్తే క్షమించేది లేదు. పాకిస్తానీయులకు, ఖలిస్తానీయులకు మద్దతిచ్చే, మద్దతు తీసుకునే అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల ఎన్నికల కోసం దీనిని రాజకీయం చేసే అవకాశం లేదు. ఈ రాత్రి వారు చాలా నిరుత్సాహానికి గురవుతారు. సంవత్సర కాలంగా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలను రావణ కాష్టంలా మండించడానికి లెక్కలు వేసి, పథకాలను రచించిన వారికి ఏం జరుగుతుంది? ఇప్పుడు వారేం చేయబోతున్నారు? టూల్‌ కిట్‌ గ్యాంగ్‌ ఇప్పుడేం చేస్తుందని'' ఆయన పెడబొబ్బలు పెట్టారు.
     వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోడానికి ముందు చనిపోయిన రైతులకు ఆర్ణబ్‌ గోస్వామి శ్రద్ధాంజలి కూడా ఘటించక పోవడం ముందుగా ఊహించిన విషయమే. రైతులు టియర్‌ గ్యాస్‌, నీటి ఫిరంగులను ఎదుర్కొన్నప్పుడే ప్రభుత్వం చట్టాలను ఎందుకు రద్దు చేయలేదని ఆయన ప్రశ్నించలేదు. అసలు ఈ చట్టాలను రద్దు చేయడానికి ముందే...గత సంవత్సరం లాక్‌డౌన్‌ విధించిన సమయంలోనే ఆర్డినెన్సులను ఎందుకు తెచ్చారని ఆయన అడగలేదు.
    'న్యూస్‌ నేషన్‌' కన్సల్టింగ్‌ ఎడిటర్‌ దీపక్‌ చౌరేషియా మోడీ నిర్ణయాన్ని ''కేంద్రం యొక్క గొప్ప నిర్ణయం''గా పేర్కొన్నారు. ''నేనేం చేసినా జాతి ప్రయోజనాలను దృష్టిలో వుంచుకొనే చేస్తా''నని మోడీ అన్నట్లు దీపక్‌ చెప్పారు. ''నువ్వు సంవత్సర కాలంగా వ్యవసాయ చట్టాలను ప్రశంసిస్తున్నావు. ఇప్పుడు ప్రధాన మంత్రి క్షమాపణలు చెప్పారు. కాబట్టి నువ్వు కూడా క్షమాపణలు చెప్పాల''ని ఆయన ట్విట్టర్‌ ఫాలోయర్లు అన్నారు.
      మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రోజును 'న్యూస్‌ ఇండియా 18' కి చెందిన అమన్‌ చోప్రా, ''ఒక ముఖ్యమైన దినం''గా పేర్కొన్నారు. రైతు నాయకుడు తికాయత్‌ నిరసన ప్రాంతాన్ని విడిచి వెళ్తున్నారా లేదా అనడిగారు. దానికి తికాయత్‌ స్పందిస్తూ, ''సరైన సమయంలో ఆ ముఖ్యమైన రోజును మేం చూపిస్తాం. విరమించే ప్రశ్న ఎక్కడిది? ఇది ప్రారంభమే. కనీస మద్దతు ధర పైన ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేయాలి. ప్రభుత్వం ఏదో చెప్పింది కాబట్టి రైతులు వెళ్ళిపోయారనే భ్రమలో ఉండక్కర్లేదు. ఇది కొరియా కాద'ని సమాధానం చెప్పారు.
     'ఆజ్‌ తక్‌'కు చెందిన అంజనా ఓం కాశ్యప్‌, మధ్య దళారులను వదిలించుకునే ఉద్దేశంతోనే వ్యవసాయ చట్టాలను తెచ్చారన్నారు. అసలు చట్టాల లోనే తప్పుడు ధోరణులు ఉన్నాయనే విషయాన్ని చెప్పుకోడానికి సిద్ధపడకుండా, చట్టాలను సానుకూలంగా అర్ధం చేసుకోవడంలో రైతులు విఫలమయ్యారన్నారామె. తికాయత్‌ తో ఆమె నిర్వహించిన కార్యక్రమం, బిజెపి అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రను కంగారు పెట్టేసింది. వ్యవసాయ చట్టాల లోని లోపాలను, కనీస మద్దతు ధర కు సంబంధించిన చట్టం అవసరాన్ని తికాయత్‌ నొక్కి చెప్పారు.
 

                                                                    కొరవడిన కొన్ని ప్రశ్నలు

వ్యవసాయ చట్టాలను మోడీ ఎందుకు, ఎలా వెనక్కు తీసుకున్నారనే విషయం గురించి ఏ ఒక్క చానల్‌ కూడా విశ్లేషించే ప్రయత్నం చేయలేదు. తన పార్టీ ఎన్నికల్లో సాధించే విజయాలను, పార్టీ రాజకీయాలను కూడా లెక్క చేయకుండా చట్టాలను రద్దు చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడుగా మోడీని చూపే ప్రయత్నం చేశాయి చానళ్లు. వ్యవసాయ చట్టాలను ఇంతకు ముందే ఎందుకు రద్దు చేయలేదు? లేదా ప్రధానమంత్రి చట్టాల రద్దు నిర్ణయానికి ముందు రైతులతో ఒక సమావేశాన్ని కూడా ఎందుకు ఏర్పాటు చెయ్యలేదు? వంటి ఇరుకున పెట్టే ప్రశ్నలను ఏ ఒక్క యాంకర్‌ కూడా అడగలేదు.
     పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ లో బిజెపి భారీగా స్థానాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రభావితం చేసే విధంగా, 2013 లో ముజఫర్‌ నగర్‌లో జరిగిన మత అల్లర్ల తాలూకు గాయాలు మానిపోవాలని అక్కడి జాట్లు, ముస్లింలు కోరుకున్నారు. కానీ ఈ విషయాలను ప్రసారం చేయలేదు. వ్యవసాయ చట్టాలకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన తర్వాత పంజాబ్‌ లో అనేక మంది బిజెపి శాసనసభ్యులు తమ నియోజకవర్గాల లోకి వెళ్లలేకపోయారు. బిజెపి తో వున్న మూడు దశాబ్దాల స్నేహాన్ని తెగతెంపులు చేసుకోవాలని శిరోమణి అకాలీదళ్‌ పై ఒత్తిడి పెరిగింది.
 

                                                                  చిత్తశుద్ధి గల స్వరాలు

ఇక్కడ రెండు మినహాయింపులు వున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దును 'అద్భుతమైన' విషయంగా పేర్కొన్నారు బర్ఖాదత్‌ తన మోజో కథనంలో. చట్టాల రద్దును ప్రకటించే సందర్భంలో ప్రధానమంత్రి 'క్షమాపణలు' చెప్పారని, ఇది 'ఎవ్వరినీ నిందించే' సమయం కాదని ఆమె అన్నారు. 'ఇది కచ్చితంగా ఎన్నికల వ్యూహం. తన విమర్శకుల కన్నా, మోడీ నేడు తన మద్దతుదారులనే ఎక్కువగా ఆశ్చర్యపరిచార'ని బర్ఖాదత్‌ అన్నారు. మోడీ భక్తులే ఆయనను ప్రధానమంత్రిగా అంగీకరించడం లేదని ప్రముఖ జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌ తన కార్యక్రమంలో చెప్పారు.
     చట్టాల రద్దును ప్రకటించిన రోజు సాయంత్రం తన అరగంట కార్యక్రమంలో ఎన్‌.డి టీవీకి చెందిన రవీశ్‌ కుమార్‌, చర్చించదగిన ప్రతి విషయాన్ని చర్చించారు. ఇతర చానళ్లు మోడీ తపస్సు, ప్రేమ, ఆప్యాయత, దయా గుణాల గురించి వివరిస్తుంటే రవీశ్‌ మాత్రం కొన్ని ప్రశ్నలు సంధించారు. ఒకవేళ ప్రధానమంత్రి మంచితనానికి మారుపేరుగా ఉంటే, ఆయన ఒక్కసారి కూడా రైతులను ఎందుకు కలవలేదు? ఇన్ని నెలల్లో సంభవించిన రైతుల మరణాలకు ఎందుకు నివాళులు అర్పించలేదు? ఆయన ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన పోరాటంలో గాయపడిన రైతులను పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు? అనడిగారు. 'ఒకవేళ ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినట్లైతే, బహూశా వ్యవసాయ చట్టాలు రద్దయ్యేవి కాదేమో' అన్నారు.
      అంతేకాకుండా సంవత్సరం పొడవునా...అధికార పార్టీ మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఎంపీలు రైతులను ఖలిస్తానీయులని ఎలా నిందించారని ఆయన ప్రశ్నించారు. 'నరేంద్ర మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా రైతుల మరణాలకు విచారాన్ని వ్యక్తం చేయలేదు. వ్యవసాయ చట్టాలను అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులు ఎదుర్కొన్న కష్టాలకు కనీసం క్షమాపణలు చెప్పలేదు. కానీ వ్యవసాయ చట్టాలలోని అనుకూలమైన విషయాలను వివరించి, రైతులను ఒప్పించడంలో తన అసమర్థతను వ్యక్తం చేయడానికే పరిమితం అయ్యార'ని రవీశ్‌ కుమార్‌ అన్నారు.
     రైతులకు మార్గాన్ని చూపిన షాహీన్‌ బాగ్‌ మహిళలను రవీశ్‌ మాత్రమే ప్రశంసించారు. ''వారు శాంతియుత నిరసనలలో భాగస్వాములయ్యారు. భారత రాజ్యాంగ పరిధిలో మాత్రమే హక్కుల కోసం పోరాటం సాధ్యమవుతుందని దేశ ప్రజలకు ఒక మార్గం చూపించార'న్నారాయన.
    వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధానమంత్రి నిర్ణయాన్ని పొగుడుతూ చేసిన కాకి గోలలో రవీశ్‌ కుమార్‌, బర్ఖాదత్‌ల స్వరాలు మాత్రమే చిత్తశుద్ధితో కూడుకున్నవి. ప్రభుత్వ కథనాన్ని ముందుకు తీసుకొని పోయేందుకు పాలక పార్టీ ఎంపీల కంటే కూడా మీడియానే ఎక్కువ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తున్నది.
 

(''ఫ్రంట్‌లైన్‌'' సౌజన్యంతో)
జియా ఉస్‌ సలామ్‌

జియా ఉస్‌ సలామ్‌