న్యూఢిల్లీ : ఆవు పేడ, మూత్రం వైరస్‌ను అదుపు చేయదని చెప్పినందుకు మణిపూర్‌లో జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద ఇద్దరిని అరెస్టు చేశారు. ఉద్యమకారుడు ఇరెండ్రో లైచోంబామ్, జర్నలిస్టు కిశోర్‌చంద్ర వాంగ్‌ఖేమ్ మే 13 నుంచి జైల్లో నిర్బంధంలో ఉన్నారు. ఆవు పేడ, మూత్రం వైరస్‌ను అదుపు చేస్తుందనే బిజెపి నేతల వ్యాఖ్యలను వ్యతిరేకించడమే వీరు చేసిన నేరం. మే 13న బిజెపి మణిపూర్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.తికేంద్ర సింగ్ కరోనాతో మరణించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. ఇప్పటికై ఆవు మూత్రం వైరస్‌ను నియంత్రిస్తుందనే ప్రచారాన్ని బిజెపి నేతలు ఆపాలని, ప్రజల్ని వైరస్ నుంచి రక్షించాలని ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదే రోజు రాత్రి ఇద్దర్నీ వారి ఇళ్ల నుంచి పోలీసులు బలవంతం గా తీసుకెళ్లారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ప్రేమచంద మీతై, పార్టీ ఉపాధ్యక్షులు ఉషం దేబన్ ఫిర్యాదు మేరకు వీరిని అరెస్టు చేశారు. వీరి విడుదలకు కుటుంబ సభ్యులు న్యాయపోరాటం చేస్తున్నారు.










