74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ గిరీష జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఈనెల 26న స్థానిక పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించే 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన అన్నమయ్య జిల్లాలో గత ఏడాది ఆగస్టు 15న మొదటిసారిగా నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అధికారులందరూ సమన్వయంతో బాగా నిర్వహించారని, ఈసారి కూడా ణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బాధ్యతాయుతంగా కషి చేయాలన్నారు. వేడుకలలో అధికారులకు కేటాయించిన విధులు పక్కాగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వ అభివద్ధి కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ వివిధ శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ జెండా ఎగరవేయుట, వేదిక అలంకరణ, సీటింగ్ ఏర్పాట్లు, తాగునీరు, సాంస్కతిక కార్యక్రమాల నిర్వహణ, ఉద్యోగులకు ప్రశంసా పత్రాల జారీ, ప్రోటోకాల్ మేరకు ఆహ్వాన పత్రికలు పంపిణీ తదితరంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు జారీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇవ్వాలన్నారు. పోలీస్ పెరేడ్ మైదానంలో షామియానా, కుర్చీలు, బారికేడింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించాలని తహశీల్దార్, మునిసిపల్ కమిషనర్లకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










