ప్రజాశక్తి-పీలేరు : 74 ఏళ్ళైనా గణతంత్ర వేడుకల్లో కులవివక్ష వీడలేదని మాలమహనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మాల మహనాడు రాయలసీమ జిల్లాల కార్యదర్శి నగరిమడుగు సుబాష్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నత ఆశయంతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ స్థాపనను తాము స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ పట్టణంలో జరిగిన 74 ఏళ్ల గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానికంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జరిగిన జెండా ఆవిష్కరణలో ఉద్దేశ పూర్వకంగానే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టడం విస్మరించి, కేవలం మిగతా దేశ నాయకులను మాత్రమే గౌరవించడం వారిలోని కులతత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధనాసి వెంకట్రామయ్య, మేముసైతం సమాజం కోసం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ షాహిన్ షా, మాలమహనాడు మండల ప్రధాన కార్యదర్శి రేగంటి హరిబాబు, కోశాధికారి మద్దెల బాలగంగాధర్, మద్దెల జనార్దన్, ఆనంద్, రవీంద్రబాబు, ప్రసాద్, రాజేంబాబు పాల్గొన్నారు.










