ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : జీవన ఉపాధి కోసం వివిధ దేశాలకు అన్నమయ్య జిల్లా నుంచి వెళ్తున్నవ వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గల్ఫ్ దేశాలలో ఉంటూ ఇబ్బందులు పడుతూ ఉండడాన్ని గమనించిన అన్నమయ్య జిల్లా పోలీసులు వారి సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 8688830014 ఏర్పాటు చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ జిల్లాలో ఏటా కొన్ని వేల మంది ఉద్యోగ ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని, అక్కడ వెళ్లిన వారు ఇబ్బందులు గురవుతుండడం తరచూ చూస్తున్నామని చెప్పారు. అక్కడ వెళ్లిన తర్వాత ఒక పని వీసాతో వెళ్తే ఇంకొక పని చేయించడం, మహిళలు ఇబ్బందులకు గురవడం జరుగుతుందని, అక్కడ ఇబ్బందులు గురవుతున్న వారి బంధువులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏజెంట్లపై ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. పోలీసులు చర్యలు తీసుకొని ఇబ్బందులు గురవుతున్న వారిని స్వదేశానికి తీసుకొస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. గల్ఫ్ వీసా విషయంలో అన్నమయ్య జిల్లా వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీన్ని దష్టిలో ఉంచుకొని గల్ఫ్ ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి బాధితులపై వివరాలు సేకరించి సమస్య పరిష్కారం కోసం అవగాహన కల్పించాలని హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునేవారు హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేసి వారి వివరాలను నమోదు చేసి ఏజెంట్ పూర్తి వివరాలు సేకరించి అనంతరం చర్యలు తీసుకోవడం తీసుకుంటామన్నారు. అన్నమయ్య జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.










