Mar 06,2023 21:35

ఫొటో : కేక్‌ కత్తిరిస్తున్న ఎం.ఎల్‌.ఎ.రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతంపై వైసిపి సంబరాలు
ప్రజాశక్తి-కావలి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో విశాఖలో రెండు రోజుల క్రితం జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ -2023 విజయవంతమైన సందర్భంగా సోమవారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కావలి ఎం.ఎల్‌.ఎ. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కత్తిరించి, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పెట్టుబడీదారుల సదస్సులో దాదాపు 13లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని, తద్వారా రాష్ట్రంలో 6లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు.
గతంలో ప్రతిపక్షాలు కేవలం చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రంలోకి పరిశ్రమలు వస్తాయని, పచ్చ మీడియా ద్వారా ప్రచారం చేశాయని, కానీ, ఈనాటి గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ -2023 ద్వారా సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సమర్థత ఏమిటో రుజువయ్యిందని పేర్కొన్నారు. ఆయన సహాయంతో కావలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అంతర్జాతీయ కార్పొరేట్‌ దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను పెడుతూ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. రెండు రోజుల సమావేశాలకు రిలయన్స్‌ గ్రూపు చైర్మన్‌ ముఖేష్‌ అంబానీతో పాటు కరణ్‌ అదానీ 30కిపైగా కార్పొరేట్‌ దిగ్గజాలు హాజర కావడం చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, కనమర్లపూడి వెంకట నారాయణ, కుందుర్తి శ్రీనివాసులు, గంధం ప్రసన్నాంజనేయులు, అమరావేదగిరి సుబ్బారాయుడుగుప్తా, గుడ్లూరు మాల్యాద్రి, యెగురు చిన్న పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.