Jul 13,2021 13:33

మేడారం : జంపన్న వాగులో పడి గల్లంతైన ఇద్దరు యువకుల కోసం మంగళవారం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో గజఈతగాళ్లను రంగంలోకి దించనున్నారు. పస్రా సిఐ అనుముల శ్రీనివాస్‌ తెలిపిన వివరాల మేరకు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొండాపురానికి చెందిన శ్యామల్‌రావు (24), కోటేశ్వరరావు (31) తమ వనదేవతలను దర్శించుకునేందుకు బంధువులతో కలిసి మేడారంకు వచ్చారు. అందరూ చెట్ల కింద సేదదీరుతుండగా... శ్యామల్‌రావు, కోటేశ్వరరావు స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకోవాలన్న ఉద్దేశ్యంతో జంపన్న వాగులోకి దిగారు. ఎగువ నుండి వరదనీరు వస్తుండటంతో అప్పటికే వాగు ఉధృతిగా ప్రవహిస్తున్నది. వాగు ప్రవాహాన్ని తట్టుకోలేక ఒకరినొకరు పట్టుకొని ఇద్దరూ గల్లంతయ్యారు. గల్లంతయిన ఇద్దరిలో శ్యామల్‌రావు అవివాహితుడు. కోటేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గమనించిన బంధువులు అక్కడి స్థానికులు, పోలీసుల సాయంతో నిన్న సాయంత్రం నుండి గాలింపు చర్యలు చేపట్టారు. వాగులో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల గాలింపు చాలా కష్టతరంగా మారింది. కాసేపట్లో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగే అవకాశముంది. మేడారంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని, జంపన్న వాగు ఉధృతి తీవ్రంగా ఉంటుందని, అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.