- ఇతర రకాల కంటే 2 క్వింటాళ్ల దిగుబడి కోత
- ఎకరాకు 20 వేలు నష్టం
- కలుపు ఖర్చు లాభం గూబల్లోకి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : బిటి-3/ హెచ్‌టి/ గ్లెయిసెల్/ ఆర్‌ఆర్‌ఎఫ్ పేరేదైనప్పటికీ ఆ రకం పత్తి విత్తనాలు రైతులను ముంచాయి. అనుమతుల్లేని, నిషేధించిన సదరు విత్తనాలను గత ఐదారేళ్లుగా యధేచ్ఛగా అమ్ముతున్నారు. కలుపుతీత ఖర్చు ఆదా అవుతుందన్న ప్రచారంతో రైతులు నిషేధిత గ్లెయిసెల్ విత్తనాల వైపు ఆకర్షితులవుతున్నారు. ఖరీఫ్‌లో వరుసగా మూడేళ్ల నుండి అధిక వర్షాలు పడుతుండటంతో గ్లెయిసెల్ పత్తి దిగుబడులు దిగజారుతున్నాయి. అనుమతులున్న బిటి రకాల కంటే బిటి-3 దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి దెబ్బతింది. రాష్ట్రంలో సగటు పత్తి ఉత్పాదకత ఎకరానికి పది క్వింటాళ్లు. వర్షాల వలన 4-6 క్వింటాళ్లకు తగ్గింది. ఇదే సమయంలో బిటి-3 రకం 3-4 క్వింటాళ్లకు పడిపోయింది. బిటి-2, నిషేధిత బిటి-3 మధ్య సగటున రెండు క్వింటాళ్ల తగ్గుదల ఉందని రైతులు వాపోతున్నారు. కలుపు ఖర్చు ఆదా అవుతుందని బిటి-3 విత్తనాలను దొంగతనంగా సాగు చేస్తే, దిగుబడులు తగ్గి ఆదా అయినదానికంటే నష్టం వచ్చిందని లబోదిబోమంటున్నారు. కలుపు నివారణ హెర్బిసైడ్స్ పచికారీకి అదనంగా డబ్బు ఖర్చు పెట్టామని ఆందోళన చెందుతున్నారు.
మూడింట ఒక వంతు అదే
ఖరీఫ్‌లో ఎపి వ్యాప్తంగా 13.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. కర్నూలు, గుంటూరు, కృష్ణా, అనంతపురం, ప్రకాశం, కడప, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో గణనీయంగా వేశారు. సాగు నిరుటి కంటే కొంచెం తగ్గినప్పటికీ ఒరవడి కొనసాగింది. గుంటూరు జిల్లా కేంద్రంగా అనుమతుల్లేని బిటి-3 పత్తి వాణిజ్య సాగు 2015లోనే మొదలై నానాటికీ విస్తరిస్తోంది. అక్రమ మార్గాల్లో రైతులకు డోర్ డెలివరీ చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పత్తి సాగులో బిటి-3 మూడింట ఒక వంతు వరకు ఉంటోంది. పత్తి అత్యధికంగా సాగు చేసే చోట్ల 40 శాతం, అంత కంటే ఎక్కువే వేస్తున్నారు.
ఎకరాకు 20 వేలు లాస్
అన్నీ అనుకూలించిన పక్షంలో ఎకరాకు 10-12 క్వింటాళ్ల పత్తి దిగుబడొస్తుంది. బాగా పండిన చోట 18 క్వింటాళ్లొచ్చిన సందర్భాలూ అరుదుగా ఉన్నాయి. మొత్తమ్మీద సగటు ఉత్పాదకత పది కివంటాళ్లు. సర్కారు ఆగస్టులో వేసిన తొలి ముందస్తు అంచనాల్లో 7.15 క్వింటాళ్లుగా పేర్కొంది. అధిక వర్షాలను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్‌లో వేసిన రెండవ ముందస్తు అంచనాల్లో 6.18 క్వింటాళ్లుగా తెలిపింది. రైత్వారీగా చూస్తే 3-6 క్వింటాళ్లొస్తోంది. బిటి-2, ఇతర హైబ్రిడ్ రకాల దిగుబడి 4-6 క్వింటాళ్లని రైతులు చెబుతున్నారు. బిటి-3 అయితే 3-4 క్వింటాళ్లు రావడం కనాకష్టంగా ఉందంటున్నారు. అసలే వర్షాలకు దిగుబడి తగ్గగా, అందులోనూ బిటి-3 ఇంకా తగ్గడంపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.6,025 కాగా రెండు క్వింటాళ్లకు రూ.12 వేల వరకు నష్టపోతున్నారు. ఈ ఏట పత్తి దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో ధర రూ.10 వేలు నడుస్తోంది. ఆ లెక్కన ఎకరాకు రూ.20 వేలు కోల్పోతున్నారు.











