గిరిజనులను హింసించి రూ.కోట్లు దోపిడీ
- ప్రజాశక్తి కథనానికి స్పందన
- అవినీతి మత్తులో మత్స్యశాఖ
- వలలు తగలబెట్టి దాష్టీకం
ప్రజాశక్తి-అల్లూరు : అల్లూరు చెరువులో కోట్ల రూపాయల మత్స్య సంపదను దర్జాగా దోచుకుంటూ అభాగ్యులైన నిరుపేద గిరిజనులను హింసించి వైసిపి నేతలు దాష్టీకానికి పాల్పడ్డారని శంభన్‌కాపు పెద్ద పోతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం 1వ తేదీన ప్రజాశక్తి దినపత్రికలో వెలుడిన 'రూ.కోట్లలో దోపిడీ' కథనంపై స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం మండలంలోని చెర్లో సంఘం గ్రామంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి పలు అంశాలను ప్రస్తావించారు. తమ పూర్వీకులైన శంభన్ కాపులు, చెర్లో సంఘం, బోడిసత్రం గ్రామ గిరిజనులు 1952 సంవత్సరంలో 21 నెంబర్ ద్వారా ఫిషర్ మెన్ సొసైటీగా ప్రభుత్వ ఉత్తర్వులతో రిజిస్టర్ చేసినట్లు వివరించారు. తదుపరి 1957లో ఓ భూస్వామి అనేక మందికి తగాదాలు పెట్టి పట్టపులకు అనుకూలంగా పొన్నపూడి ఫిషరీస్ సొసైటీని ఏర్పాటు చేశారని తెలియజేశారు. అనంతరం 1991లో మరో భూస్వామి టిడిపిని అడ్డం పెట్టుకుని నాన్ లోకల్ వ్యక్తులతో న్యూ ఫిషర్‌మెన్ సొసైటీ ఏర్పాటుచేసి మత్స్య సంపదను రాత్రి, పగలు తేడా లేకుండా దోచుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అత్యంత విస్తీర్ణమైన చెరువులు సర్వేపల్లి, అల్లూరు. స్థానిక చెరువు పూర్తి విస్తీర్ణం 2,700 ఎకరాలన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన నాటినుండి ఓ భూస్వామి ఆ చెరువు సంపదపై కన్నేసి కోట్ల రూపాయలు దోచుకుని అందులో చేపలను బహిరంగంగా తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు తరలించి సంపదను తన జేబులో వేసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా హింసాకాండతో గిరిజనుల వలను లాక్కొని కాల్చి వేసిన సంఘటనలు కోకోల్లుగా ఉన్నాయన్నారు. అభాగ్యులైన కొందరిపై అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందాన్ని పొందారని విచారం వ్యక్తం చేశారు. అల్లూరు పంచాయతీలోని 25 గిరిజన కాలనీలకు రూ.25 లక్షలు అలాగే శంభన్ కాపులకు రూ.15 లక్షలు ఇస్తానని మభ్యపెట్టినట్లు గుర్తు చేశారు. సంబంధిత విషయంపై పూర్తి స్పందించాలని అధికారులకు వివరించినా వ్యంగ్యంగా మాట్లాడుతూ పెడచెవిన పెడుతున్నారని దుయ్యబట్టారు. కొంతమంది అవినీతి అధికారుల వల్ల మత్స్య సంపదకు భద్రత లేకుండా పోతుందన్నారు. జిల్లా కలెక్టర్ చొరవతో విచారణ జరిపి తగు న్యాయం చేయాలన్నారు. అనంతరం నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా చైర్మన్, మండల వైసిపి ఎస్‌టిసెల్ మండల అధ్యక్షులు దాసరి పోలయ్య మాట్లాడుతూ గిరిజనులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని హామీనిచ్చారు. కోట్ల రూపాయలు దోచుకున్న వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల నుంచి మనుషులను పిలిపించి గిరిజనులకు జీవన భృతి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తపరిచారు. అక్రమ మత్స్య సంపదను కొల్లగొడుతూ తమపై దాడులు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. సంబంధిత విషయంపై కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి ఆయన సతీమణి ఆదిలక్ష్మి దృష్టికి తీసుకెళ్లామన్నారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకూ న్యాయపోరాటం సాగిస్తానని హామీనిచ్చారు. కార్మిక దినోత్సవం మేడే రోజున మత్స్య సంపదను కోట్లలో దోచుకుంటున్నారని ప్రజాశక్తిలో కథనం రావడంతో అధికారులు ఖంగుతున్నారు. వైసిపి నేతలు వెంటనే చేపల వేటను నిలిపివేసి గుడిసెలను తీసివేశారు.










