రెక్కలు ముక్కలు చేసినాం
నేలను చదునుగా వుంచినాం
నీరు లేకపోతే
మా చెమటతో తడిపినాం
మొక్క నేలను చీల్చుకుని
బయటికి తొంగి చూడగానే
లోలోన మురిసిపోయినాం
ఖరీదైన మందుల్తో
చెట్టును పెంచి పోషించినాం
వేలకు వేలు ఖర్చు పెట్టి
పిందెను కాపెట్టుకున్నాం
కష్టం ధారపోసి కోత కోసి
గింజ గింజను పోగు చేసినాం
కుప్పగా కాయలు పోసినాక
ఏలికల కన్ను కుట్టిందని తెలిసి
మెలికలు తిరిగిపోయినాం
గద్దెనెక్కిన చట్టమొకటి
రైతు బతుకుపై కుంపటైందని
పోరు బాట పట్టినాం
పిడికెడు పంట గింజలపై
తన పిడికిలి బిగించిందని
మట్టి మనుషులై కదిలినాం
నేటి పాలిత తీరును చూసి
గింజ పకపకా నవ్వేసింది
రైతుల సమ్మె లోని
ఆకలి వేదన ఆక్రందన చూసి
కన్నీరు మున్నీరుగా విలపించింది
ఎదురొడ్డి నిలబడినాం
న్యాయం కోసం పోరాడుతున్నాం
అన్నదాతగా విలపిస్తున్నాం
- నరెద్దుల రాజారెడ్డి,
సెల్ : 9666016636










