Dec 31,2021 07:37

- వివిధ నగరాల్లో కోటీ 50 లక్షల మంది కార్మికులు
- 16 గంటలు..20 గంటలు పని
న్యూఢిల్లీ :
ఫుడ్‌ డెలివరీ, కొరియర్‌ డెలివరీ, క్యాబ్‌..ఇలా పేరేదైనా వారి వృత్తి కంపెనీ సేవల్ని వినియోగదారుడి ఇంటి వద్దకు చేర్చాలి. వీరిని 'గిగ్‌ వర్కర్స్‌'గా పిలుస్తున్నాం. దేశంలో కోటీ 50 లక్షల మంది పనిచేస్తున్న ఈ రంగం గురించి ఆలోచించే తీరిక పాలకులకు లేదు. 16 గంటలు..18 గంటలు పనిచేయించుకున్నా ఇదేమని అడగడానికి వీలుగాని పరిస్థితి. కుటుంబాన్ని పోషించుకోవటం కోసం మానసికంగా, శారీరకంగా రాజీపడుతూ కార్మికులు పనిచేయాల్సి వస్తోంది. దీనిని ఆయా కంపెనీలు (ఆమోజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం, ఓలా..మొదలైనవి) అవకాశంగా మలుచుకున్నాయి.
మనదేశంలోని గిగా వర్కర్స్‌ పని పరిస్థితుల గురించి 2019లో 'ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌'(ఐఎఫ్‌ఏటీ), ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఐటీఎఫ్‌) అధ్యయనం చేసింది. గిగా వర్కర్స్‌ పని పరిస్థితులు, కంపెనీల దోపిడిని తెలియజేస్తూ 'ఐఎఫ్‌ఏటీ' సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కార్మికచట్టాల్లో పేర్కొన్న విధంగా వీరికి నిబంధనలు వర్తింపజేయాలని, ప్రభుత్వం ద్వారా సామాజిక, సంక్షేమ పథకాలు అమలు అయ్యేట్టు చూడాలని పిటిషన్‌లో కోరారు. సంస్కరణల పేరుతో గొప్ప గొప్ప చట్టాలు చేసే కేంద్రం కార్మికుల సంక్షేమంపై ఎందుకు ఆలోచించటం లేదని ఐఎఫ్‌ఏటీ ప్రశ్నిస్తోంది.

మోడీ సర్కార్‌లో స్పందన కరువు
ఫ్రాన్స్‌, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌ దేశాల్లో 'గిగా వర్కర్ల'ను కార్మికులుగా వర్గీకరించారు. వారికి సామాజిక భద్రతా, ప్రయోజనాల్లో ప్రాధాన్యత కల్పించారు. ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఇ-శ్రమ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. డిసెంబర్‌ 14 నాటికి పోర్టల్‌లో మొత్తం 7,27,921 మంది గిగ్‌ వర్కర్లుగా నమోదుచేసుకున్నారు. అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై ప్రతిపక్షాలు, సుప్రీంకోర్టు పదే పదే కోరిన తర్వాత మోడీ సర్కార్‌లో కదలిక రావడం లేదు. కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు.

పెద్ద నగరాల్లో దాదాపు 11యాప్‌లు ఫుడ్‌ డెలివరీ సేవల్ని అందిస్తున్నాయి. ఇందుకోసంగాను నియమించుకుంటున్న వారికి న్యాయమైన వేతనం, పనిపరిస్థితులు, కాంట్రాక్ట్‌ ఒప్పందం, మేనేజ్‌మేంట్‌.. దొరకటం లేదు. గిగా వర్కర్స్‌ వారంలో ఏడు రోజులు పనిచేస్తున్నారని హైదరాబాద్‌కు చెందిన 'టిస్‌' అనే సంస్థ తన సర్వేలో పేర్కొన్నది.