Aug 29,2020 07:24


శబ్దాన్ని, అర్ధాన్ని ఒకదానినొకటి విడదీసి చూడలేనట్లే గిడుగు రామ్మూర్తి పంతులునూ, జీవితకాలం పోరాడి గెలిచిన వారి వ్యావహారిక భాషోద్యమాన్ని వేరు చేసి చూడలేం. 1863 ఆగష్టు 29న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో వెంకమాంబ, వీర్రాజు దంపతులకు జన్మించిన గిడుగు రామ్మూర్తి ప్రాథమిక విద్యాభ్యాసం వారణాసి గున్నయ్య దగ్గర జరిగింది. మెట్రిక్యులేషన్‌ విజయనగరం మహారాజా వారి కళాశాలలో చదివారు. గిడుగు, గురజాడ ఆ కళాశాలలో సహాధ్యాయులే కాదు నాటి కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర శాస్త్రి ప్రియశిష్యులు కూడా! తెలుగు సాహిత్యంలో గిడుగు రామ్మూర్తి గారికి అఖండ వ్యాప్తిని, అనంత ఖ్యాతిని తెచ్చిన అంశాలలో ఒకటి సవర భాషకు చేసిన సేవ. రెండవది వ్యావహారిక భాషా సేవ. పర్లాకిమిడిలో మిడిల్‌ స్కూలులో చరిత్ర ఉపాధ్యాయునిగా పని చేసే రోజుల్లో గిడుగు దృష్టంతా కొండ కోనల్లో జీవించే అనాగరిక జాతి అయిన సవరలపై ఉండేది. వారిని విద్యావంతులను, నాగరికులను చేయాలనే తపనతో 'తౌడు' అనే పైడివాని సాయంతో తాను సవర భాషను నేర్చుకుని సవర డైలాగ్స్‌ (1912), సవర సాంగ్స్‌ (1913), సవర రీడర్‌ (1914), సవర-తెలుగు నిఘంటువును నిర్మించారు. మిత్రుడు గురజాడను, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస అయ్యంగారిని, విద్యాధికారి ఏమీ దొరను కలుపుకుని గిడుగు 1911లో వ్యావహారిక భాషోద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమ వ్యాప్తిలో భాగంగా 'తెలుగు' , ఏట్స్‌ దొరతో కలిసి 'టీచర్‌' అనే పత్రికలను స్థాపించారు. వ్యాస రచనల్లోను, పరీక్షల్లోను మాట్లాడే భాషనే రాయాలన్నది గిడుగు వాదన. ఇదే విషయాన్ని 'ఎ మెమొరాండమ్‌ ఆన్‌ మోడరన్‌ తెలుగు' అనే రచనలో వెల్లడించారు. ప్రజోపయోగ రచనలు చేసే సమయంలో కొందరు కృతకంగా ఉండే ఈ గ్రాంథిక భాషను రాసి లేనిపోని భేషజాన్ని ప్రదర్శిస్తూ ఆ రచనను నిరుపయుక్తం చేస్తున్నారని, అది సరికాదని ఒకానొక సమయంలో గిడుగువారు శ్రీమతి శారదాంబతో తెలిపారు. గ్రాంథిక భాష రాసే శక్తి లేకనే గిడుగు వ్యావహారిక భాషా గొడుగు కిందకు చేరాడని హేళన చేసే గ్రాంథికవాదుల నోరు మూయించటానికి 'ప్రాదెనుగమ్మ' అనే వ్యాసాన్ని రాశారు గిడుగు. చెళ్ళపిళ్ళ వారన్నట్లు 'గిడుగా-పిడుగా!''. గిడుగు వ్యావహారిక భాషా సిద్ధాంతకర్త అయితే, గురజాడ ప్రయోగశీలి. గిడుగు వారి శిష్య పరంపరలో ఒకరైన తాతాజీ తన 'జనవాణి' పత్రికలో వ్యావహారిక భాషకు పట్టమే కట్టారు. శ్రీశ్రీ అన్నట్లు గిడుగు నిజంగా 'ఇన్‌స్పిరేషన్‌'. ఈనాడు మనం ఏం మాట్లాడుతున్నామో అదే రాసే యోగం, ఆమోద యోగ్యం పొందామంటే అది గిడుగు కృషి అని చెప్పక తప్పదు. ఆయన జన్మదినమైన ఆగష్టు 29వ తేది తెలుగు ప్రజలకు బ్రహ్మోత్సవం. తెలుగు భాషా దినోత్సవం.
- కె. జోసఫ్‌,
ఆంధ్ర లయోలా కళాశాల అధ్యాపకులు,
విజయవాడ. సెల్‌ : 79954 95154