అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు ఇక ఏడాది మాత్రమే గడువు ఉంది. ముందస్తు వస్తే మరింత ముందుగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలు పెట్టాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో ఏ నియోజకవర్గంలో ఎవరికి పట్టుంది. ఎవరైతే బెస్ట్ అవుతారన్న దానిపై ఆయా పార్టీలు సీరియస్‌గా దృష్టి సారించాయి.
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గెలుపు అభ్యర్థుల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అన్వేషణ మొదలైంది. ఇప్పటికే అధికార వైసిపి వివిధ సర్వేల ద్వారా గెలిచే అభ్యర్థులను గుర్తించే పనిలో పడింది. అటు నిఘా వర్గాల ద్వారానూ, ఇటు సర్వే సంస్థల ద్వారానూ వెతుకులాట ప్రారంభించింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని క్షుణ్నంగా పరిశీలించే పని చేపట్టింది. ఇందులో పాత కాపులెవరైనా మంచివారుగా ఉండి, వారి వారసులెవరైనా ఉన్నారా అనే అన్వేషణ మొదలు పెడుతున్నారు. పాత నాయకుల్లో మంచి పేరున్న వారు ఉంటే వారిని తెరపైకి తీసుకొస్తే ఎలాగుంటుందన్న పరిశీలనను అధికార వైసిపి చేస్తుండటం గమనార్హం. ఈ మేరకు అనంతపురం నగరంలో ఎన్.రామకృష్ణ, డి.నారాయణస్వామిల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వారి వారుసుల కోసం అన్వేషణ సాగుతుండటం చర్చనీయాంశమైంది. ఇక సర్వే సంస్థలు సైతం ఆయా నియోజకవర్గాల్లో పట్టున్న వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ప్రతిపక్ష టిడిపి కూడా నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల మార్పులు చేస్తామన్న సంకేతాలను ఇస్తోంది. కటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశమిస్తారన్న ప్రచారమూ సాగుతోంది. టిడిపి కూడా అవసరమైతే ఇతర పార్టీల్లోనున్న సీనియర్ నాయకులను తీసుకురావడంగానీ, వారి కుటుంబ సభ్యులను తీసుకురావడంగానీ చేయాలన్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉంటున్న వారు కొంత మంది స్తబ్ధుగా ఉన్నారు. వారిని వచ్చే ఎన్నికల బరిలో నిలిపితే ఎలాగుంటుందన్న యోచన సాగుతోంది. ఈ అంశాలన్నింటిపైనా సర్వేలు సైతం చేయిస్తున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలై ఉన్నారు.
సమీక్షలు మొదలు
అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సైతం రెండు పార్టీలూ సిద్ధం అయ్యాయి. వైసిపి రాయలసీమ పార్టీ కన్వీనర్‌గానున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా కార్యక్రమాలను జిల్లాలో చేపడుతున్నారు. ఇందులో పార్టీ పరిస్థితులను అంచనావేసి శ్రేణులను సన్నద్ధం చేసే పనిలో ఉన్నారు. టిడిపి ఇదేమి ఖర్మ పేరుతో ప్రజల్లోకి వెలుతోంది. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పర్యటన కూడా ఉండే అవకాశముంది. ఈ సమయంలోనే పార్టీ పరిస్థితిని సమీక్షించే అవకాశాలూ ఉన్నాయి. ఏదిఏమైనా జిల్లాలో ఇప్పుడు రాజకీయ వేడి క్రమక్రమంగా పెరుగుతోంది. నాయకులు వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.










