Jul 17,2021 22:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించి గెజిట్లో పేర్కొన్న వెలిగొండ, ప్రకాశం బ్యారేజీ, సీలేరు, బనకచర్ల, అవుకు టన్నెల్‌లకు సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గెజిట్‌లో పేర్కొన్న అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలను సవివరంగా ఈ లేఖలో పేర్కొననున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లోనే పూర్తి వివరాలతో లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపుతారని సమాచారం. వెలిగొండ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని, దానిని అనుమతులు లేని ప్రాజెక్టులలో ఎలా చేరుస్తారని అధికారులు అంటున్నారు. పైగా ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తయిన ప్రస్తుత దశలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య తీవ్ర నష్టం కలిగిస్తుందంటున్నారు. ప్రకాశం బ్యారేజి బోర్డు పరిధిలోకి తీసుకురావడం కూడా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు అంటున్నారు. ఈ బ్యారేజి పూర్తిగా రాష్ట్రం పరిధిలోనే ఉన్న విషయాన్ని అధికారులు ప్రస్తావిస్తున్నారు. పైగా ఇక్కడి నుండి దిగువకు వెళ్లే నీరు నేరుగా సముద్రంలో కలుస్తాయని, అందువల్ల ఇక్కడ నీటి వినయోగం విషయం ఇతర రాష్ట్రాలతో సంబంధం లేదని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు. అయితే, పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా ఉండటంతో ప్రకాశం బ్యారేజిని కూడా గెజిట్‌లో చేర్చి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోతిరెడ్డిపాడును బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి మరలా దానిపైనే నిర్మించిన బనకచర్ల రెగ్యులేటర్‌ను, అవుకు టన్నెల్‌ను బోర్డు పరిధిలోకి తేవడం ఎంతవరకు సమంజసమని అధికారులు అంటున్నారు. దీంతోపాటు తెలంగాణాకు ఎటువంటి సంబంధమూ లేని సీలేరును కూడా గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేయాలని నిర్ణయించారు. తుంగభద్ర హైలెవల్‌ కెనాల్‌నూ కృష్ణాబోర్డులోకి తేవడం ద్వారా అక్కడ నీటి వినియోగంపైనా ఆంక్షలు ఉంటాయని, పైగా రెండు బోర్డుల పరిధిలోకి ఇది వస్తుందని, దీన్ని వెంటనే కృష్ణా బోర్డు పరిధి నుండి తొలగించాలని కోరనున్నారు.