ప్రజాశక్తి-విజయవాడ: స్పందన అర్జీలు రీ ఓపెన్ కాకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నూపుర్ అజరు, డిఆర్‌ఒ కె మోహన్‌కుమార్, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జె సునీత అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 24 గంటల్లో పరిష్కరించాల్సిన అర్జీలను పెండింగ్‌లో ఉంచరాదని అధికారులను ఆదేశించారు. స్పందనలో 108 అర్జీలు నమోదు అయ్యాయని, వీటిలో ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 41, పోలీసుశాఖ 18, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ 9, హౌసింగ్ ఆరు, మెడికల్ అండ్ హెల్త్ నాలుగు, పంచాయతీరాజ్ నాలుగు, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ నాలుగు, విద్యాశాఖ నాలుగు, మిగిలిన శాఖలకు సంబంధించిన మొత్తం 108 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ వివరించారు.
ప్రజా సమస్యలు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి పలు అర్జీలను మేయర్, కమిషనర్ స్వీకరించారు. స్పందన కార్యక్రమములో ప్రధానంగా పట్టణ ప్రణాళిక ఐదు అర్జీలను, ఇంజనీరింగ్ విభాగం ఒకటి, పబ్లిక్ హెల్త్ విభాగం మూడు, ఎస్టేట్ విభాగం రెండు, యుసిడి మూడు అర్జీలను పరిష్కరించినట్లు మేయర్, కమిషనర్ వివరించారు. సర్కిల్ కార్యాలయాల్లో నిర్వహించిన స్పందన కార్యాలయంలో ఆరు అర్జీలు వచ్చినట్లు జోనల్ కమిషనర్లు తెలిపారు.










