Jul 08,2022 22:35

ప్రజాశక్తి-విజయవాడ: నిర్దేశించిన గడువులోగా అర్జీలను పరిష్కరించి, అర్జీదారులను సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ స్పందన సమావేశం మందిరంలో శుక్రవారం అన్ని శాఖల అధికారులతో స్పందన ఆర్జీల పరిష్కారం పై జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్జీలను కూలకుషంగా, నిశితంగా ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని అధికారులను కోరారు. ఆర్జీదారుడు ఆర్జీ ఇస్తూ సమస్యను వివరిస్తున్నప్పుడు శ్రద్దగా వినాలని అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ధరఖాస్తులను పూర్తి స్థాయిలో చదివి అర్థం చేసుకుని పరిష్కార మార్గం చూపాలన్నారు. గడువులోగా ఆర్జీలను పరిష్కరించాలని, ఎట్టిపరిస్థితిలోను గడువు దాటిన ఆర్జీలు ఉండరాదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు పోర్టల్‌, డాష్‌బోర్డు, ప్రత్యక్షంగాను వివిధ మార్గాల ద్వారా 14,447 ఆర్జీలు నమోదు కాగా వీటిలో 293 ఆర్జీలు మాత్రమే గడువులోగా పరిష్కరించవలసినవి ఉన్నాయని వీటిని సంబంధిత శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు .ఈ సమావేశంలో డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌ పాల్గొన్నారు.
చిరువ్యాపారులకు జగనన్న తోడు అందించాలి
చిరువ్యాపారులకు జగనన్న తోడును అందించి ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. జగనన్న తోడు పథక లబ్దిదారుల ఎంపిక, రుణాల మంజూరుపై జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం నుండి డిఆర్‌డిఏ, మున్సిపల్‌ కమీషనర్లు, యంపిడివోలు, తహాశీల్థార్లు, సంబంధిత అధికారులతో గూగుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించే వారికి బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించి ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం జగనన్నతోడు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. జిల్లాలో చిరువ్యాపారస్తులను గుర్తించి ప్రతి ఒక్కరికి జగనన్న తోడు పథకాన్ని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మూడవ విడతలో రెన్యువల్‌, కొత్తగా వచ్చిన 15,922 మంది లబ్దిదారులు వివిధ బ్యాంకుల ద్వారా ధరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. వీరిలో 11,972 మందికి బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయగా, కేవలం 197 మందికి మాత్రమే రుణాల మంజూరు అంగీకారం తెలపడం జరిగిందన్నారు. నాల్గవ విడతలో 2,166 మంది లబ్దిదారులు ధరఖాస్తులు చేసుకోగా, 1094 మందికి బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీరిలో 147 మందికి రుణాలు అందించడం జరిగిందని మరో 471 మందికి రుణాలు అందించేందుకు బ్యాంకు అధికారులు సిద్దంగా ఉన్నారన్నారు. రుణాలు మంజూరు చేసిన ప్రతి లబ్దిదారునికి వెంటనే బ్యాంకుల నుంచి రుణాల సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.