ప్రజాశక్తి కదిరి టౌన్ : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. సోమవారం కదిరి రూరల్ మండలం, పట్నం గ్రామ పంచాయతీలోని రాచువారిపల్లి తండా, వీరేపల్లిపేట, ఏటిగడ్డ తండా గ్రామాలలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పలువురి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. 'గతంలో మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కారం కానప్పుడు ఏ మొహం పెట్టుకొని మా గ్రామానికి వచ్చార'ంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. పట్నం చెరువులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ చెరువు కింద సాగు చేసుకుంటున్నా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు సొసైటీ పరిధిలోకి వెళ్ళినందున మూడు సంవత్సరాల కాలంగా చెరువులో నీరున్నా పంటలు పెట్టుకోలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. చెరువు సమస్యను రోడ్ల సమస్యపై పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పంచాయతీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఇంతవరకు గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదని వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే గడపగడప మన ప్రభుత్వం నిర్వహిస్తున్నామని. మూడున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో రోడ్లన్నీ తామే వేస్తున్నామని చెప్పారు. పూర్తిగా ప్రజల వద్దకు పాలనను తీసుకువచ్చి, నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపట్టారన్నారు. అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరవేస్తున్నామన్నారు. నిరంతరం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, జెడ్పీటీసీ రాధాబాయి, మండల కన్వీనర్ ప్రకాష్, వైస్ ఎంపీపీ ఆనంద్‌నాయక్, సర్పంచి చలపతి నాయక్, జిల్లా అగ్రి బోర్డ్ మెంబర్ సుధీర్ రెడ్డి, టిఎం. మైనుద్దీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇంద్రారెడ్డి, సర్పంచులు భాస్కర్, నారాయణ నాయక్, శ్రీనివాసులు నాయక్, రాంప్రసాద్ రెడ్డి, ఎంపిటిసి కుమార్ రెడ్డి, శివకుమార్, నరసింహులు నాయక్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఎస్టీసెల్ కృష్ణ నాయక్, గంగిరెడ్డి, జైనుల్లా, ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు










