Dec 09,2022 21:50

పెట్రోల్‌ బాటిల్‌తో నిరసన తెలుపుతున్న ఎంపిటిసి భర్త నాగరాజు

        చిలమత్తూరు : హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో శుక్రవారం నాడు ఎమ్మెల్సీ మొహమ్మద్‌ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో అధికార పార్టీ నేతల నుంచే నిరసన వ్యక్తం అయ్యింది. తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామంలో ఎలా కార్యక్రమం నిర్వహిస్తారంటూ చిలమత్తూరు-3 ఎంపిటిసి నాగమణి భర్త నాగరాజు పెట్రోల్‌ మీద పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈయనతో పాటు మరికొందరు ఎంపిటిసిలు సైతం ఎమ్మెల్సీని అడ్డుకుని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంట, వడ్డిచన్నంపల్లి గ్రామాల్లో గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో తలపెట్టారు. ఈ గ్రామాల పరిధిలో ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన తమకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ వైసిపి ఎంపిటిసిలు నాగమణి, కవిత, సానామ్‌ఉన్నీసాలు ఎమ్మెల్సీని అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరికీ తాను ఫోన్‌ చేసి ఎలా సమాచారం ఇవ్వగలనని, సమాచారాన్ని వాట్సాప్‌ ద్వారా పంపానని వారికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. గ్రామంలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎంపిటిసిలు ఎమ్మెల్సీ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరుగుతుండగానే తుమ్మలకుంట క్రాస్‌ నుంచి గ్రామంలోకి వెళ్లేందుకు ఎమ్మెల్సీ కారు ఎక్కుతుండగా ఎంపిటిసి భర్త నాగరాజు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న గ్రామస్తులు, రూరల్‌ సిఐ వేణుగోపాల్‌లు అడ్డుకుని, పెట్రోల్‌ బాటిల్‌ను లాక్కొని పక్కకు విసిరేశారు. అసమ్మతి నేతలు 'ఎమ్మెల్సీ గో బ్యాక్‌' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనల మధ్యనే ఎమ్మెల్సీ తుమ్మలకుంటలో గడపగడపకు కార్యక్రమం కొనసాగించారు. కాగ హిందూపురం అధికార పార్టీలో గత కాలంగా కొనసాగుతున్న అసమ్మతి జ్వాలలు ఈ ఘటనలో మరోసారి బహిర్గతం అయ్యాయి.