May 31,2023 22:01

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

'గడప గడపకు మన ప్రభుత్వం'
ప్రజాశక్తి అనంతసాగరం : మండలంలోని రేవూరు గ్రామంలో బుధవారం ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ప్రజలకు అందచేసిన సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం గ్రామంలో రూ.33 లక్షలతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, అధికారులతో కలసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 93 సచివాలయాల్లో 56వ సచివాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రతిపక్ష పార్టీలు బాదుడే బాదుడు లాంటి కార్యక్రమాలను ప్రారంభించి ప్రభుత్వంపై బురదజల్లే విధంగా ప్రజల్లోకి తీసుకొచ్చారని, అవి అన్ని దారుణంగా విఫలమయ్యాయన్నారు.
నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రం దివాళా తీస్తుందని, ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని ఎన్నో రకాలుగా వ్యాఖ్యలు చేశారని, కానీ నాలుగు రోజుల క్రితం జరిగిన తమ పార్టీ కార్యక్రమంలో జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే పేర్లు మార్చి వివరించారని, పరోక్షంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనకు వాళ్లు కూడా సమర్థించారన్నారు. ప్రతిపక్ష పార్టీలు 2009, 2014లలో తాము ప్రజల కోసం ప్రకటించిన ఎన్నికల మెనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకొచ్చి ఎంత వరకు అమలు చేశారో వివరించాలని తెలిపారు. అదే విధంగా 2019లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన మెనిఫెస్టో ఎలా అమలు జరిగిందో ప్రజలే వారికి వివరిస్తారని అన్నారు. 2014 ఎన్నికల్లో సమయంలో ప్రతిపక్ష పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, ఆ సమయంలోనే జగనన్న ఆ పథకం వర్తింప చేయడం వీలుకాదని తెలిపారని, అప్పట్లో ప్రజలు ఆయనను నమ్మి గెలిపిస్తే రుణమాఫీ ఎంత మేరకు అమలు చేశారో ప్రతి ఒక్కరికీ తెలుసనన్నారు. మహిళలు తీసుకున్న రుణాలను పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పారని, కానీ వారు అమలు చేయకపోవడంతో జగనన్నే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రుణమాఫీ నగదును అక్కచెల్లెమ్మలకు అందించి వారిని ఆదుకున్నారన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, పలు శాఖల అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.