గద్దర్ స్ఫూర్తి నేటి యువతరానికి అవసరం
సిఐటియు నేత కంగారపు మురళి
పుస్తక ఆవిష్కరణలో ప్రముఖులు
ప్రజాశక్తి - క్యాంపస్ : ఉద్యమాలే ఊపిరిగా తన పాటలతో గానం చేస్తూ యావత్ తెలంగాణతో పాటు తెలుగు ప్రజలందరినీ మేలుకొలిపిన సామాజిక విప్లవ నేత గద్దర్ స్ఫూర్తి నేటి యువతరానికి ఎంతో అవసరం ఉందని సిఐటియు నేత కంగారపు మురళి పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో 'గద్దర్ స్ఫూర్తి' పుస్తక ఆవిష్కరణ ప్రజాసంఘాల ఐక్యవేదిక, ఆంధ్రనాడు దినపత్రిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన వక్తలు ప్రసంగిస్తూ గద్దర్ ఆలోచనలు, ఆయన సాహిత్యం, పోరాట పటిమ, అన్ని వర్గాలను ఆకట్టుకున్నదని కొనియాడారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎస్వీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ ప్రిన్సిపల్ ఆచార్య పద్మనాభం మాట్లాడుతూ అణగారిన వర్గాలనుజాగతం చేయడంలో ముందడుగు వేశారని ఆ ముందడుగును ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత భవిష్యత్ తరాల మీద ఉన్నదని ఆయన అన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి ఉపన్యసిస్తూ పేద బడుగు బలహీన వర్గాల ఆయన పాట ఓ గొంతుక అని, ప్రశ్నించలేని వారి గొంతుక అయ్యారని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు ప్రసంగిస్తూ సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో గద్దర్ లాంటి విప్లవాత్మక ఆలోచనలు అవసరమని, ప్రస్తుత సమాజంలో రహస్య విప్లవం జరుగుతోందని అది త్వరలోనే విస్పోటం జరుగుతుందన్నారు. ఆ విస్ఫోటనం జరిగినప్పుడే ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరిగి పాలనలో పారదర్శకత పెరుగుతుందన్నారు. గద్దర్ స్ఫూర్తి పుస్తక రచన వ్యయప్రయాసలకు వేసినటువంటి పల్నాటి శ్రీరామ్ కు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అధ్యక్షులు నూక తోటి బాబురావు ప్రసంగిస్తూ అంబేద్కర్ ఆశయాలను రాజ్యాంగ స్ఫూర్తిని వ్యాప్తింపజేయడంలో గద్దర్ అగ్రగన్యుడని తన ఆట, పాటతో అణగారిన ప్రజానీకానికి గొంతులో నీరు పోసి తట్టి లేపారని కొనియాడారు. గద్దర్ స్ఫూర్తి పుస్తక సంపాదకులు శ్రీరామ్ మాట్లాడుతూ ఇందులో 176 మంది సమకాలిన, ఉద్యమ వాసనలు తెలిసిన వారితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారన్నారు. ఇది ఒక చరిత్ర పుస్తకం కాగలరని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పి.అంజయ్య మాట్లాడుతూ ఈ పుస్తకంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సామాజిక స్పహ కలిగిన ఉద్యమ వాసనలు పసిగట్టిన అనేకమంది గద్దర్ గూర్చి రాయడం ఒక చరిత్ర కాగలరన్నారు. ప్రముఖ రచయిత గొడుగు చింత గోవిందయ్య డాక్టర్ వెంకట్ నారాయణ, ఆచార్య శ్యామ్ డేవిడ్, ఆంధ్రనాడు హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.










