- కార్యాలయాల్లో ఇంకా మౌలిక వసతుల కొరత
- కలెక్టరేట్లో కొలిక్కి వచ్చిన వసతులు
- ఎన్టీఆర్ జిల్లా ఏర్పడి 100 రోజులు
ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి
నూతనంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాలో పరిపాలన ఇప్పుడిప్పుడే గాడినపడుతోంది. జిల్లా ఏర్పాటై 100 రోజులు పూర్తవుతున్నా పలు కార్యాలయాల్లో విధుల నిర్వహణకు అవసరమైన మౌలిక వసుతులు అందుబాటులో లేవు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా మౌలిక వసతుల కొరత నెలకొని ఉంది. జిల్లాల పునర్విభజన, నూతన జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంది. దీంతో అధికారులంతా ఒక్కసారిగా తమకు కేటాయించిన కార్యాలయాల్లో కొలువు తీరడానికి అవస్థలు పడ్డారు. కేవలం నెల రోజుల గడువు ఇచ్చి కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, వాటిలో వసతులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో నాటిజిల్లా అధికారులు గందరగోళానికి గురయ్యారు. కీలకమైన ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఎక్కడ పెట్టాలనే దానిపై సుమారు 15 రోజులపాటు తర్జన భర్జనలు పడ్డారు. తొలుత గొల్లపూడిలో ఏర్పాటు చేయాలని అనుకున్నా ఆ తర్వాత సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలకు సరైన భవనాలు అందుబాటులో లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో విజయవాడ నగరంలో ఉన్న ఆయా శాఖల కార్యాలయాలల్లోనే జిల్లా అధికారుల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న నూతన జిల్లాగా ఎన్టీఆర్ విజయవాడ జిల్లా ఆవిర్భవించింది. కొత్తగా తిరువూరు, నందిగామ రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. మూడు రెవిన్యూ డివిజన్లు, 20 మండలాలు, 321 గ్రామాలతో కలిపి జిల్లాను ఏర్పాటు చేశారు. సుమారు 3,316 చదరపు కిలో మీటర్ల వైశాల్యం కలిగి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 22,18,591 మంది జనాభా ఉన్నారు. ఎన్‌టిఆర్ జిల్లాకు ప్రథమ కలెక్టర్‌గా ఎస్.డిల్లీరావు, జెసిగా అజరుకుమార్ నూపూర్, డిఆర్‌ఒగా కె.మోహన్‌కుమార్ నియమితులయ్యారు. జిల్లా ఏర్పాటై 100 రోజులు కావస్తున్నా జిల్లా అడ్మిన్‌స్ట్రేషన్‌కు సంబంధించి ఇంకా ఒడిదుడుకులు ఉన్నాయి. కలెక్టరేట్ కార్యాలయంలో విధుల నిర్వహణకు అవసరమైన వాతావరణం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. కలెక్టర్ ఛాంబర్‌ను మాత్రం పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. ఇదే కాంపౌండ్‌లో జెసితోపాటు డిఆర్‌ఒ ఛాంబర్లు, పేషీలకు నూతన భవనాన్ని అందుబాట్లోకి తెచ్చారు. అయితే కలెక్టరేట్ ఆవరణ మొత్తం గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో చెరువును తలపిస్తోంది. పారుదల సౌకర్యం లేక వర్షంనీరు నిలిచిపోయింది. దీంతో కార్యాలయాలకు వచ్చే అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్లానింగ్, ల్యాండ్ సర్వే శాఖలకు మౌలిక సదుపాయాల కల్పన ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. టేబుళ్లు, కంప్యూటర్లు, వైరింగ్, ఎలక్ట్రిఫికేషన్, నెట్ కనెక్టింగ్ వంటి సదుపాయాలు పూర్తి కావస్తున్నాయి. సుమారు 68 విభాల వరకూ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ అధిక శాతం కార్యాలయాల్లో బల్లలు, కంప్యూటర్లు, నెట్ కనెక్టివిటీ వంటి సదుపాయాలు అందించాల్సి ఉంది. ఇదిలాంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన రికార్డుల విభజన, తరలింపు ప్రక్రియ ప్రారంభమైనా పూర్తి కావాల్సి ఉంది. రికార్డులను ఉమ్మడి కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నుంచి ఎన్టీఆర్ జిల్లాకు తీసుకొని రావాల్సి ఉంది. ఏళ్ల తరబడి ఎంతో విలువైన ఫైళ్లు ఉండటంతో విభజన, తరలింపులపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌డేట్ చేయలేదు. ఎన్టీఆర్ జిల్లా పేరుతో వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేసినా శాఖలు, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న అధికారులు, వారి ఫోన్ నంబర్లు, ఈ మెయిల్స్ వంటి వివరాలు అప్‌డేట్ కాలేదు. దీంతో వెబ్‌పోర్టల్ ద్వారా జిల్లా సమాచారం తెలుసుకోవాలనుకునే వారు అసంతృప్తికి గురవుతున్నారు.










