Oct 18,2023 18:07

ప్రజాశక్తి-నందిగామ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ పాత బస్టాండ్ లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది. పాత బస్టాండ్ శ్రీ బాలాజీ డోర్స్ - వుడ్ వర్క్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ షాపులో సిబ్బంది బుధవారం తెల్లవారుజాము వర్కర్లు పనిచేశారు. పని ముగించుకుని షాపుకు తాళ్ళాలు వేసి వెళ్ళిన వెంటనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపుగా షాపులో ఫర్నిచర్ మరియు మిషనరీ మొత్తం కలిపి దాదాపు రూ. 80 లక్షల నుండి కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లిందని షాపు యజమాని మెండే ప్రసాద్ తెలిపారు.  మంటలను నందిగామ, కంచికచర్ల ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజిన్లు మంటలను రెండు గంటల పాటు శ్రమించి అదుపులోకి తీసుకుని వచ్చారు. నందిగామ ఎసిపి జనార్ధన్ నాయుడు, నందిగామ  పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హనీష్, ఎస్ఐ పండు దొర, ఎఎస్ఐ శ్రీనివాసరావు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నందిగామ ఎంఎల్ఎ మొండితోక జగన్ మోహన్ రావు, మాజీ ఎంఎల్ఎ తంగిరాల సౌమ్య లు వేర్వేరుగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. షాపు యజమానుని మండే ప్రసాద్ ను పరామర్శించారు. అగ్ని ప్రమాదం సంఘటన జరగటం చాలా దురదృష్టకరమన్నారు. నష్టం ఎవ్వరూ పూడ్చలేనిదన్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని నందిగామ ఎంఎల్ఎ హమీ ఇచ్చారు.