ప్రజాశక్తి-పీలేరు: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే మన అందరి కర్తవ్యమని డాక్టర్ చంద్రశేఖర్ నాయక్ తెలియజేశారు. గురువారం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పీలేరు మండల మహిళా సమాఖ్య భవనంలో మహిళా సంఘ మిత్రలకు 'ఎయిడ్స్ రహిత సమాజం నిర్మిద్దాం' అనే అంశంపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ గురించి ఆందోళన పడవద్దని, నిర్ములనకు మెరుగైన అవగాహన అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా నేడు యువత ఎయిడ్స్ వ్యాధి బారినపడడం ఆందోళన కలిగించే విషయమని, కావున ఆ మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకోడానికి ప్రాథమిక అవగాహన చాలా అవసరమని చెప్పారు. హెచ్‌ఐవి సోకిన వారిలో దీరెకాలిక జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, జలుబు మొదలగు లక్షణాలు కనబడతాయన్నారు. రక్త పరీక్ష ద్వారా హెచ్‌ఐవి నిర్ధారించుకుని వ్యాధి నిరోధక శక్తి నిర్వీర్యం కాకుండా మెరుగైన జీవనం కోసం దగ్గర్లోని ప్రభుత్వ వైద్యాధికారిని కలిసి ఉచిత చికిత్స, సలహాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ కొండయ్య, పర్యవేక్షకులు కృష్ణయ్య, ఎఎన్‌ఎం విజయకుమారి, సిహెచ్‌ఒ ఆయేషా, వెంకటరత్నం, ఆశ కార్యకర్తలు, విఒ లీడర్లు పాల్గొన్నారు.










