రాష్ట్రం లోని ఎయిడెడ్ విద్యాసంస్థల్లో లక్షలాదిమంది పేద, దళిత, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇన్నాళ్లూ వీటికి ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తూ వచ్చింది. చంద్రబాబు 2004లో ఆ ఎయిడ్‌ను పరిమితం చేసి ఎయిడెడ్ విద్యాసంస్థలపై మొదటి చావుదెబ్బ తీశారు. తాజాగా జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలకు ప్రభుత్వంలో విద్యాసంస్థలను విలీనం చేయడమో, కాకుంటే ప్రభుత్వ ఎయిడ్ లేకుండా ప్రైవేటుగా నడుపుకోవడమో ఎంచుకోవాలని అల్టిమేటం ఇచ్చింది. ఎయిడెడ్ విద్యా సంస్థలన్నింటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నడుపుతానంటే ప్రజలకు అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ, ప్రైవేటుగా నడుపుకుంటారా, లేక ప్రభుత్వంలో విలీనం చేస్తారా అని ఎంచుకునే వీలు కల్పించడం వలన దాదాపు అన్ని ఎయిడెడ్ విద్యాసంస్థలూ ప్రైవేటు విద్యావ్యాపారం చేసుకోవడానికే మొగ్గు చూపుతాయి. అంటే, ఇది ఆ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు, చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న అధ్యాపకులకూ తీరని అన్యాయం చేస్తుంది. మేం నడిపేందుకు సిద్ధమే అని ప్రభుత్వం ప్రకటించినంత మాత్రాన ఎయిడెడ్ వ్యవస్థను నాశనం చేయాలన్న తమ అసలు తలంపును కప్పిపుచ్చలేరు. విద్యను కార్పొరేటీకరించడంలో ఇది మరో చర్య మాత్రమే!
బ్రిటిష్ ఇండియాలో 19వ శతాబ్దం నాటికి ఊపందుకున్న సాంఘిక సంస్కరణోద్యమాలు, తదనంతరం వెల్లువెత్తిన జాతీయోద్యమం ఫలితంగా ప్రజలే తమ విద్యాకాంక్షను నెరవేర్చుకోవడానికి విద్యాసంస్థల స్థాపనకు పలుచోట్ల పూనుకున్నారు. దీనికి పలువురు దాతలు సానుకూలంగా స్పందించారు. బందరు నోబుల్ కళాశాల, విజయనగరం మహారాజ కళాశాల, గుంటూరు ఎ.సి, హిందూ కళాశాలలు, నెల్లూరు వి.ఆర్ కళాశాల, విజయవాడ లోని మాంటిస్సోరి విద్యాసంస్థలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! బ్రిటిష్ ఏలుబడిలోనే ప్రారంభమైన ఎన్నో విద్యాసంస్థలకు స్వాతంత్య్రానంతరం మన ప్రభుత్వాలు అందరికి విద్యనందించాలన్న రాజ్యాంగ లక్ష్య సాధనలో భాగంగా సహకారం అందించాయి. ఆ విధంగా అవి ఎయిడెడ్ సంస్థలైనాయి.
కానీ, ప్రపంచబ్యాంకు ఆదేశిత విధానాల అమలు తరువాత ఈ పరిస్థితి మారింది. లాభ, నష్టాల లెక్కలే ప్రభుత్వాలకు కొలబద్దలైన వేళ ప్రభుత్వ విద్యారంగంతో పాటు ఎయిడెడ్ వ్యవస్థను నీరుగార్చడం ప్రారంభమైంది. చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేసేది లేదంటూ జీఓనే జారీచేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆ జీఓను రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పటికి, ఆ తరువాత వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ప్రభుత్వంలో విలీనం పేరుతో కార్పొరేట్లకు బాటలు వేస్తున్నారు. వేలాదిమంది విద్యార్థులకు జ్ఞానభిక్ష పెట్టిన విజయనగరం మహారాజ కళాశాలలో ప్రస్తుతం జరుగుతున్నదదే! అందుకే స్థానికంగా అంత వ్యతిరేకత. ఇది అక్కడితో ఆగదు! ప్రభుత్వంలో విలీనం చేస్తారా... ఎయిడ్ నిలిపివేయమంటారా! అంటూ ప్రకాశం జిల్లాలో 230 ఎయిడెడ్ విద్యాసంస్థలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఈ తరహా కసరత్తే జరుగుతోంది. ఇది పూర్తయితే, ఎందరో పేద విద్యార్థులకు చదువు అందకుండా పోతుంది. దీనికి భిన్నంగా కేరళలో ఎయిడెడ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసే విధంగా అక్కడి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నందున అక్కడి విద్యావిధానం పటిష్టంగా, దేశానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే, ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యావంతులు, మేధావులు, ప్రజాతంత్ర శక్తులపై ఉంది. విద్యపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నూరుశాతం ఎయిడ్‌ను అందించాలని, ఎయిడెడ్ విద్యావ్యవస్థను బతికించాలని డిమాండ్ చేయాలి.










