ప్రభుత్వ విద్యా రంగాన్ని బలహీనపరిచి మొత్తం విద్యా వ్యవస్థను ప్రైవేటు పరం చేయాలనే ప్రపంచబ్యాంకు లక్ష్యాలకు అనుగుణంగానే రాష్ట్ర పాలకులు వ్యవహరిస్తున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రతి సంవత్సరం ఎయిడ్ తగ్గించివేసే ప్రక్రియను చంద్రబాబు ప్రారంభించారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి అదే విధానాన్ని కొనసాగించారు. జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలను అన్‌ఎయిడెడ్‌గా ప్రకటించి పూర్తిగా ప్రైవేట్‌పరం చేస్తున్నది.
ప్రైవేటు దారి పట్టించే కుట్ర
పార్వతీపురం ఆర్.సి.యం. బాలుర, బాలికల హైస్కూళ్ళలో దాదాపు 12 వందల మంది చిన్నారులు చదువుతున్నారు. ఆర్.సి.యం సంస్థ మరో మూడు ప్రాథమిక పాఠశాలలు నడుపుతున్నది. పార్వతీపురంలో దాదాపు 800 మంది విద్యార్థులతో వెంకటేశ్వర డిగ్రీ కాలేజి ఎయిడెడ్ కాలేజీగా నడుస్తున్నది. బొబ్బిలి రాజా కాలేజిలో దాదాపు 2500 మంది విద్యార్థులు చదువుతున్నారు. గరివిడిలో ఎస్.డి.ఎస్ డిగ్రీ కాలేజీ, ఎస్.ఆర్.జె జూనియర్ కాలేజీ, గోదావరి హైస్కూల్ ఎయిడెడ్ సంస్థలుగా నడుస్తున్నాయి. వీటిలో దాదాపు 4000 మంది విద్యార్థులు చదువుతున్నారు. విజయనగరం ఎం.ఆర్.కాలేజి, ఉమెన్స్ కాలేజీలలో 6.5 వేల మంది చదువుతున్నారు. ఎం.ఆర్. హైస్కూలు, ఇంగ్లీషు మీడియం స్కూలు, మోడల్ స్కూల్లో 1500 మంది చదువుతున్నారు. ప్రభుత్వం ఈ ఎయిడెడ్ సంస్థలను అన్ ఎయిడెడ్‌గా మార్చివేసింది. విద్యార్థినీ విద్యార్థులందరినీ ప్రైవేటు విద్యా సంస్థల వైపు తరిమేస్తున్నది.
ఈ ప్రశ్నలో దురుద్దేశ్యం లేదా?
చంద్రబాబు 2003 నుండి ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్ళకు ప్రతి సంవత్సరం 10 శాతం ఎయిడ్ కోత మొదలుపెట్టారు. తరువాత వచ్చిన వైఎస్సార్ ప్రభుత్వం దాన్నే కొనసాగించింది. ప్రభుత్వం ఎయిడెడ్ సిబ్బందిని నియమించడం మానేసింది. ఫలితంగా రిటైర్ అయిన టీచర్లు, సిబ్బంది స్థానంలో మరలా రెగ్యులర్ టీచర్ల నియామకం ఆగిపోయింది. దాంతో కాంట్రాక్టు, ఇతర పద్ధతుల్లో తక్కువ వేతనాలతో సిబ్బందిని నియమించుకొని స్కూళ్ళు, కాలేజీలు నడుపుతున్నారు. 'ఎయిడ్ లేకుండా స్కూళ్ళు, కాలేజీలు నడుపుకుంటారా? లేక ప్రభుత్వ పరం చేస్తారా?' అని జగన్ ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. ఈ ప్రశ్న ఉద్దేశ్యం ఏమిటి? ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్యాలను కాలేజీలు, స్కూళ్ళు, భూములు, బిల్డింగులు స్వంతం చేసుకోమనడమే కదా?
ఆ భూములు, సదుపాయాలు ప్రైవేటువారికి ఇచ్చేస్తారా?
విద్యా వ్యాప్తి కోసం ఏనాడో దాతలు ఇచ్చిన భూముల్లో విద్యా సంస్థలను ధార్మిక సంస్థలు నెలకొల్పాయి. ఒకప్పుడు ఊరి చివర ఏర్పాటు చేసిన స్కూళ్ళు, కాలేజీలన్నీ నేడు పట్టణాలు, నగరాల నడిబొడ్డున ఉన్నాయి. వాటి విలువ నేడు రూ. వందలు, వేల కోట్లకు చేరింది. అందువలన అన్ని సంస్థలు విద్యార్థులను, సిబ్బందిని వదిలించుకుని భూములు, భవనాలు, ఫర్నిచర్, లైబ్రరీ, లేబరేటరీ మొత్తం స్వంతం చేసుకోవాలని చూస్తున్నాయి. భూములను దాతలు ఇవ్వగా బిల్డింగులు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో కట్టినవి. లైబ్రరీ, లేబరేటరీలు సర్వం ప్రజాధనమే. ఎయిడెడ్ విద్యా సంస్థలు పెట్టింది ఏమీ లేదు. ఏ పెట్టుబడీ లేకుండా, ఏ కష్టం లేకుండా ఫీజులు వసూళ్ళు చేసుకుని ఇక ముందు ప్రైవేటు సంస్థలుగా నడుపుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
నాడు విద్యా దానం పేరిట దాచుకున్నారు
నేడు స్వంతం చేసుకుంటున్నారు
ఎస్టేట్స్ అబాలిషన్ యాక్ట్ వచ్చిన తరువాత విజయనగరం సంస్థానంలో భూమంతా దున్నేవారికే ఇచ్చేయాలి. మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని కింద విజయనగరం సంస్థానాధిపతులు దాదాపు 20 వేల ఎకరాలు అట్టిపెట్టుకున్నారు. వాటి ఆదాయంతో విద్యా దానం చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవంగా ప్రభుత్వం ఇచ్చిన ఎయిడ్ తోనే మాన్సాస్ విద్యా సంస్థలు నడిచాయి. ప్రభుత్వం ఎయిడ్ తగ్గించివేయడంతో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ప్రవేశపెట్టి పి.జి. కాలేజీని, ఇంజనీరింగ్ కాలేజీని నడిపి అక్కడ వచ్చిన ఫీజులతో ఎం.ఆర్. ఉమెన్స్ డిగ్రీ, ఇంటర్, హైస్కూళ్లు నడుపుతున్నది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయంతో ఏనాడో ప్రజలకు చెందాల్సిన భూములు మాన్సాస్ ట్రస్ట్ నిర్వాహకుల స్వంతం అవుతున్నాయి. ఇన్నేళ్ళు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిర్మించిన బిల్డింగులు, గ్రంథాలయం, లేబరేటరీలు, ఫర్నిచర్ మొత్తం ట్రస్టు పరం అవుతున్నాయి. జగన్ ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు ద్రోహం చేసి ఎయిడెడ్ విద్యా సంస్థల పాలక వర్గాలకు లాభం చేసింది.
చెరుకు రైతుల డబ్బుతో నిర్మించారు
ఎయిడెడ్ పి.యు.సి. హైస్కూలు, ఎలిమెంటరీ స్కూలును బొబ్బిలి సంస్థానం నడిపేది. 1970 లలో బొబ్బిలిలో డిగ్రీ కాలేజీ కట్టాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన డబ్బును సీతానగరం, బొబ్బిలి షుగర్ ఫ్యాక్టరీలకు వచ్చే చెరుకుపై టన్నుకు రెండు రూపాయల చొప్పున వసూలు చేసింది. ఆ రోజుల్లో రెండు ఫ్యాక్టరీలు రోజుకు 2.5 వేల టన్నులు క్రషింగ్ చేసేవి. అంటే రోజుకు 5 వేల రూపాయల చొప్పున రైతుల నుండి వసూలు చేసి కాలేజి బిల్డింగులు, ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలు నెలకొల్పారు. చెరకు రైతుల డబ్బుతో కాలేజి నిర్మించగా ప్రభుత్వ ఎయిడ్ తోనే కాలేజీ నడిపింది. నాడు చంద్రబాబు, నేడు జగన్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజా ధనం కాలేజి నిర్వాహకుల పరం అవుతున్నది.
ఏడాది మధ్యలో ఎక్కడకు పోవాలి?
ఎయిడెడ్ టీచింగ్ సిబ్బందిని ప్రభుత్వం తీసుకొని, విద్యార్థులకు టీసీలు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరం మధ్యలో నిర్ణయించింది. దీంతో ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు దిక్కుతోచడం లేదు. ఆస్కూళ్ళను, కాలేజీలను మూసి వేసి విద్యార్థులను ప్రభుత్వ కాలేజీలకు, స్కూళ్ళకు తరలించమంటున్నది. లేని ప్రభుత్వ కాలేజీలకు, స్కూళ్ళకు విద్యార్థులను ఎలా తరలించాలో జగనే చెప్పాలి. విజయనగరం జిల్లాలో ఎయిడెడ్ విద్యా సంస్థలు కూడా ప్రభుత్వ విద్యా సంస్థల లాగే ఫీజులు లేకుండా, ప్రభుత్వ విద్యా సంస్థల్లో వలే హాస్టలు, ఇతర సౌకర్యాలు ఉన్నందున ప్రజలకు ప్రభుత్వ కాలేజీ అవసరం లేకుండా పోయింది. ఆ విధంగా విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి, పార్వతీపురం పట్టణాల్లో ఎక్కడా ప్రభుత్వ కాలేజీలు లేవు. స్కూళ్ళు కూడా తగినంతగా లేవు. విద్యా సంవత్సరం మధ్యలో 'మీరు వెళ్ళిపోండి' అంటే ఎక్కడకు పోతారు?
ఫీజులు కట్టలేక భీతిల్లుతున్న ప్రజలు
పార్వతీపురం నుండి కురుపాం మధ్య మెటాడోర్ నడిపే ఓ డ్రైవర్‌కు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ ఆర్.సి.యం స్కూళ్ళలో చదువుతున్నారు. అర్ధంతరంగా స్కూళ్ళు మూసివేసి పిల్లలను బయటకు నెట్టివేయడంతో వారిని ప్రైవేటు స్కూళ్ళలో చేర్పించాల్సి వచ్చింది. మిగిలిన విద్యా సంవత్సరానికి ఒక్కొక్కరికీ రూ.25 వేలు ఫీజు చెల్లించాల్సి వచ్చింది. ఒక్కరికి మాత్రమే అమ్మ ఒడి రూ.14 వేలు వచ్చాయి. మిగతా డబ్బు ఎక్కడ నుండి తేవాలని ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడతను. పార్వతీపురం ఆర్.సి.యం బాయిస్ స్కూల్‌కు వెళ్ళాం. 'ప్రభుత్వం స్కూలు యాజమాన్యం అభిప్రాయం తీసుకున్నది. తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకోకుండా ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? రాష్ట్రాన్ని పాలించేవారికి ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత లేదా?' అని ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.
ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలి. అన్ ఎయిడెడ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి. అప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పుతుంది. ప్రత్యామ్నాయంగా స్కూళ్ళు, కాలేజీలు నిర్మించాల్సిన అవసరం ఉండదు. విద్యా సంవత్సరం మధ్యలో ఎక్కడికీ పోలేం. టి.సి లు తీసుకోం...అని విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు...జనమంతా కదిలి పోరాడితే ప్రభుత్వమే దిగి వస్తుంది.
- ఎం. కృష్ణమూర్తి
సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు










