వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి తండ్రి, మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (78) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హరీశ్వర్‌రెడ్డి మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ప్రజలకు హరీశ్వర్‌రెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్‌రెడ్డి.. ఇటీవలే కోలుకొని ఇంటివద్దే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి భోజనానంతరం ఇంట్లోనే కళ్లు తిరిగి కిందపడిపోయారు. కుటుంబీకులు సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే అంబులెన్సులో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మఅతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. హరీశ్వర్ రెడ్డి ఉపసర్పంచిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. దశాబ్దకాలం సర్పంచిగా కొనసాగారు. 1985లో పరిగి నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1985 నుంచి 1987 వరకు ఆగ్రో ఇండిస్టీస్ డైరెక్టర్‌గా, 1987 నుంచి 1989 వరకు టిటిడి సభ్యుడిగా వ్యవహరించారు. 1997 నుంచి 2000 వరకు ఆర్థిక సంస్థ ఛైర్మన్‌గా కొనసాగారు. 2012లో తెరాస (భారాస)లో చేరారు. హరీశ్వర్‌రెడ్డికి భార్య గిరిజాదేవి, కుమారులు మహేష్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, కుమార్తె అర్చనారెడ్డి ఉన్నారు.










