భద్రాచలం : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో కన్నుమూశారు. భద్రాచలంలోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్య నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. బిజెపి నేతలు, కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు. కాగా, 2009 ఎన్నికల్లో భద్రాచలం నుంచి సత్యవతి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ మరణానంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తరువాత వైసిపిలోకి చేరారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ కాంగ్రెసులోకి వెళ్లారు. కొంతకాలం నుంచి ఆ పార్టీతోనూ, ఇతర ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా ఉన్నారు. చివరకు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.










