సంక్రాంతి రోజు లక్ష్మమ్మ వేకువ జామునలేచి ఇంటిముందు కళ్ళాపు చల్లి అందమైన ముగ్గు వేసి, మధ్యలో పూలతో అలంకరించిన గొబ్బెమ్మను వుంచి ఇంటిలోనికి వెళ్ళింది. వీధిలోని వారు అందమైన ముగ్గును, ఆ ముగ్గుకు మరింత అందం తెచ్చే గొబ్బెమ్మను చూసి మెచ్చుకొంటూ వెళ్లడం ప్రారంభించారు. జరిగినది చూస్తున్న ముగ్గుకూ, గొబ్బెమ్మకూ మధ్యలో గొడవ ప్రారంభమైంది.
'నీకన్నా నేనే గొప్పదాన్ని నా ముగ్గు బాగుంది!' ముగ్గమ్మ గర్వంగా అంది.
'నీకన్నా నేనే గొప్పదాన్ని, నేను లేకుంటే నీ ముగ్గుకు అందం వచ్చేది కాదు!' మరింత గర్వంతో అంది గొబ్బెమ్మ.
'గొబ్బెమ్మా! నాకోసం నడుం వంచి ముగ్గువేయడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందన్న విషయం తెలీదా?' అంది.
'నాలో క్రిమినాశక గుణాలు మెండుగా వున్నాయన్న సంగతి నీకు తెలీదా ముగ్గమ్మా?'
ముగ్గమ్మకూ, గొబ్బెమ్మకూ కాళ్ళూ చేతులు వుంటే పెద్ద యుద్ధమే జరిగేది. ఇద్దరూ 'నేను గొప్ప.. నేను గొప్ప..' అంటూ తిట్టుకోవడం చూసిన ఒక చిలుక చెట్టుపైనుండి ఎగురుకుంటూ వారి దగ్గరకు వచ్చింది.
'చిలుకా! మా ఇద్దరిలో ఎవరు గొప్ప?!' అడిగింది ముగ్గమ్మ.
'బాగా అలోచించి నిజాయితీగా చెప్పు చిలుకా!' అంది గొబ్బెమ్మ.
'ముందు మీరిద్దరూ కాస్సేపు మౌనంతో మన ఎదురున్న ఇంటిలో జరుగుతున్నది గమనించండి!' అంది చిలుక .
చిలకమ్మ చెప్పిన విధంగా ఆ ఇంటిలో జరుగుతున్నది గమనించసాగారు.
***
కొడుకు జయరామయ్య, కూతురు కృష్ణవేణి తల్లి కాళ్లపై పడుతుంటే 'మీరిద్దరూ నా కాళ్లపై ఎందుకు?!' అంటూ దూరంగా జరిగింది లక్ష్మమ్మ.
'అమ్మా! మీరు మాకోసం ఎంతో శ్రమించారు. నా చిన్న వయసులోనే నాన్న మరణిస్తే కష్టపడి నన్ను చదివించి, మంచి పదవిలో చేరడానికి కారకులయ్యారు. అందుకే ఈ పండగ రోజు ముందుగా మీకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకోవాలనుకొన్నాం!' అన్నాడు జయరామయ్య.
'అమ్మా! నన్ను తమ్ముడితో సమానంగా చదివించి, ఆ తరువాత పెద్ద వ్యాపారస్థుడికి ఇచ్చి పెళ్లి జరిపించారు. మేమింత ఉన్నత స్థితికి రావడానికి మీరే కారణం. మమ్మల్ని ఆశీర్వదించమ్మా!' అంది కృష్ణవేణి.
కొడుకూ కూతురూ లక్ష్మమ్మ కాళ్లపై పడి, నమస్కరించారు.
***
జరిగిందంతా విన్న ముగ్గమ్మ, గొబ్బెమ్మలో మార్పు వచ్చింది
'ఆ అక్కా తమ్ముడు 'నేను గొప్ప.. నేను గొప్ప..' అని గొడవ పడకుండా వారి గొప్పతనానికి కారకులైన తల్లిని ఆశీర్వదించమని కోరడమే అసలైన గొప్పతనం' అంది ముగ్గమ్మ.
'ముగ్గమ్మా! మనలో ఎవరు గొప్ప అని వాదించడం కన్నా మనల్ని ఇంతగా తీర్చిదిద్దిన ఆ లక్ష్మమ్మకే మనమూ కృతజ్ఞతలు చెప్పుకొందాము' అంది గొబ్బెమ్మ
'మీలో మార్పుకు నా అభినందనలు', అంటూ సంతోషంతో చెట్టుపైకి ఎగురుకొంటూ వెళ్ళిపోయింది చిలుక.
* ఓట్ర ప్రకాష్ రావు, 097874 46026