Dec 27,2020 07:16

'రవి కాంచని చోట కవి గాంచున్‌' అంటారు. కవి.. తన సూక్ష్మదృష్టితో సృష్టిలోని అందాలను, నిగూఢమైన విషయాలను వెలుగులోకి తేగలడు. తాను గాంచిన అవలక్షణాలను, వైకల్యాలను, వైఫల్యాలను సమాజం ముందు ఆవిష్కరించగలడు. ఈ విజ్ఞానాన్ని మనం మన అమూల్యమైన నేత్రాలతో స్పృశించగలం. ఆస్వాదించగలం. ఈ సమాజంలో సృష్టి అందాలను చూడలేని నిర్భాగ్యులైన అంధులు ఎందరో ఉన్నారు. వారందరూ నిరాశా నిస్పృహలతో కృంగిపోకుండా, వారి జీవితాల్లో విజ్ఞాన జ్యోతులను, ఆశా దీపాలను వెలిగించడానికి విశ్వవ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి... జరుగుతున్నాయి... జరుగుతాయి కూడా. వాటన్నింటిలోనూ అంధులకు ప్రత్యేక లిపి కనుగొన్న లూయిస్‌ బ్రెయిలీ ప్రయత్నం ప్రధానమైనది. ఆయన పేరిట జనవరి 4న అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సముచితం. నేడు అంధులు విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, సంగీత కళాకారులుగా, చిత్రకారులుగా, అన్నిరంగాల్లో విజయం సాధించడానికి బ్రెయిలీ లిపి ఎంతగానో దోహదపడింది. అందుకే ఆయన అంధుల అక్షరశిల్పి. నిత్యం అంధుల మనసుల్లో, వారి మునివేళ్లలో జీవించే చిరంజీవి ఆయన.
పేదరికం, అంగవైకల్యం ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయన్నది అనేక అధ్యయనాల సారాంశం. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందిన ఏ సమాజం అయినా... వైకల్యాలున్న వ్యక్తులు తమ కలలను సాకారం చేసుకోడానికి, సమాన స్థాయి పౌరులుగా వుండటానికి అవకాశాలను కల్పించాలి. వారికి ఆరోగ్యం, ఆహారం, భద్రతకు సంబంధించి భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉదాహరణకు కోల్‌కతా, సికింద్రాబాద్‌ల్లోని అంధుల సాధికారత కేంద్రాలను మూసివేత నిర్ణయం తీసుకుంది. ఇది వారి జీవనశైలిని విచ్ఛిన్నం చేసే నిర్ణయం. దీనిపై వికలాంగులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అంధుల కోసం ప్రత్యేకంగా నిర్ధేశించిన ఈ కేంద్రాలను దశల వారీగా ఇతర సంస్థల్లోకి విలీనం చేయడానికి, ప్రభుత్వేతర రంగాలకు మళ్లించడానికి కేంద్రం సిద్ధమైంది. దేశంలోని ప్రతి రంగాన్నీ కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీ ప్రభుత్వం... అంధులను సైతం వదిలిపెట్టలేదు. శారీరకంగా లేదా మానసికంగా సాధారణ జీవనం సాగించలేని నిస్సహాయులైన వీరి హక్కులను కూడా కార్పొరేట్ల పాదాక్రాంతం చేయడానికి సిద్ధమైంది. వీరి సామాజిక జీవన స్థితిగతులను మెరుగుపరిచి, వారిలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన ప్రభుత్వం... వీరి బాధ్యతను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడమంటే.. 'కాదేదీ దోపిడీ కనర్హం' అన్నట్లే.
మునుపెన్నడూ లేని విధంగా కొవిడ్‌ వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎలా ఉంటుందో తెలియని ఈ వైరస్‌ మన వ్యవస్థను, మన జీవన సరళిని పూర్తిగా మార్చివేసింది. లాక్‌డౌన్‌ కాలంలో సాధారణ ప్రజలు సైతం ఎన్నో ఇబ్బందులను చవిచూడాల్సి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ఏ వ్యవస్థా ఇంకా కుదురుకోలేదు. ఈ క్రమంలో అంధులు, వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు ప్రపంచానికి కొత్త కోణంలో పరిచయమవుతున్నాయి. ఈ వైకల్యాన్ని జీవన వైవిధ్యంగా పరిగణించి, వారిని సమాజంలో అంతర్భాగంగా, మనలో ఒకరిగా భావించాలి. ఈ సమస్యలను సానుభూతితో కాకుండా... తోటివారిగా సానుకూలంగా అర్థం చేసుకోవాలి. సమాజం యొక్క నిజమైన అభివద్ధి... ఆ సమాజంలోని దుర్బలురు, నిస్సహాయుల హక్కులను సైతం పరిరక్షించడం, వారినీ ప్రగతి పథంలో భాగస్వాములను చేయడంపైనే ఆధారపడి ఉంటుంది. ఆ వైకల్యం వ్యక్తులది కాదు... ఈ సమాజానిది. ఈ ప్రభుత్వాలను నడిపిస్తోన్న విధానాలది. వికలాంగులు సైతం ఈ సమాజంలో భాగం. వారిని సమాజాభివృద్ధిలోనూ భాగస్వాములను చేయాలి. ప్రతియేటా డిసెంబర్‌ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. వికలాంగులకు కనీస హక్కులు లభించనినాడు 'వికలాంగుల హక్కుల చట్టం' వంటివి ఎన్ని తెచ్చినా, దినోత్సవాలు పాటించినా వికలాంగుల సంక్షేమం అనాదరణగానే మిగిలిపోతుంది. పూర్తిస్థాయిలో తమ హక్కులు పొందడానికి ఆందోళన బాట పట్టక తప్పని పరిస్థితి వస్తుంది. అందుకే ప్రభుత్వాలు వికలాంగులను సైతం ఆందోళనబాట పట్టే పరిస్థితి కల్పించకుండా, వారికి అవసరమైన సంక్షేమ చర్యలు చేపట్టాలి.