Dec 02,2020 07:41

అదేంటో అందరికీ నేనంటే ఒక్కో రకం
వింత వాదన వుంది మనసులో
నాకోసం దేవుళ్లను దేశమంతా
తలొక రకంగా మొక్కేస్తుంటారు.
నేనొచ్చిన రోజు స్కూలుకు సెలవిస్తరని
సందు చివర సన్నీ గాని ఆలోచన,
వాడు ఇంట్లో ఉంటే వేగలేమని
నన్ను ఆపమని వాళ్ళమ్మ వాదన
పంటలు రావాలని నన్ను రమ్మంటారు
వాగులు-వంకలు మరమ్మతు చేయక
అవి పొంగి ఇళ్ల లోకి వస్తే
నన్ను కాస్త తగ్గించమని వేదన
కప్పలకు పెళ్లిళ్ళు చేసి పిలుస్తారు
కాసేపు వస్తే వెళ్ళమని నిలుపుతారు
ఇళ్లు కూలుస్తానని తిడతారొకరు
తిండి గింజలు పెట్టాలని రా అంటారు మరొకరు
వచ్చినంత సేపు నన్ను వుండనివ్వరు
వరుణ దేవుడని పొగడుతూనే
రాకాసి వాన అని వాపోయేరు
ఎవరి వాదన ఏమైనా
నా రాకడ-పోకడ మీ చేతుల్లోనే
చెట్లుంటే వస్తా , అవి లేకుంటే వేశాక వస్తా.


- సింగంపల్లి శేష సాయి కుమార్‌