Dec 25,2020 07:03

''ఎటు పోతున్నావ్‌ కరోనా?'' అంటూ మసూచి సమాధిపై కూచున్న టి.బి, ఫ్లూ, జికా, సార్స్‌, ఎయిడ్స్‌, ఆంథ్రాక్స్‌, కలరా, పోలియో, ఇంకొన్ని వైరసులు ప్రశ్నించాయి. సమాధానం రాలేదు.
''కాలరెగరేసుకొని పోతున్నావు, కొత్త బట్టలు కుట్టించుకున్నావు ఎక్కడికి?'' మళ్ళీ అదే ప్రశ్న. ఇక తప్పింది కాదు కరోనాకి. నోరు విప్పాల్సి వచ్చింది.
''రెండో దశకు'' ధీమాగా చెప్పింది.
''మానవుడి గురించి నీకు పూర్తిగా తెలీదు. మేమిప్పుడు ఊరికే బతికున్నామనే కాని...కూచుంది ఎక్కడో చూశావా?''.
''చూశాను, మసూచి సమాధిపై!!''
''ఇంకొన్ని చిన్న చిన్న సమాధులు కనిపిస్తున్నాయా''
''అవీ చనిపోయిన వైరసులే''
''నీక్కూడా సమాధి కడతాడు మానవుడు. అది ఎంతో పెద్దగా ఉంటుంది. అప్పుడు నీ సమాధిపై కూచొని మాట్లాడుకుంటాం''
''మీరు భయపడుతుంది మానవుడి గురించే, కానీ నా ధైర్యమూ మానవుడే'' గర్వంగా చెప్పింది కరోనా.
''ఎలా?'' ఒక వైరసు ప్రశ్న.
''ఎలా ఏముంది, మీ కాలంలో మనిషికి తెలిసిన సైన్సు తక్కువే, కాబట్టి ఎలాగో బతికి బట్ట కట్టారు. కాని ఇప్పుడు ఎంత సైన్సు తెలిసినా కామన్‌ సెన్సు పూర్తిగా కోల్పోయాడు మానవుడు'' కోవిడ్‌ సమాధానం విని వైరసులన్నీ వెలిగిపోతున్న మొహాలతో చూడసాగాయి.
''ఓ సగటు మానవుడి మాటలు వినండి మీకే తెలుస్తుంది. జనాలను కూచోబెట్టి కొన్ని విషయాలు చెబుతున్నాడు. అతని మాటల నుండి ఇతరులేమి నేర్చుకుంటారో తెలీదు కాని, నాకు కొండంత ధైర్యాన్నిస్తున్నాడు. వినండి''


''ఇది ఎవరినీ భయపెట్టడానికి చెప్పడం లేదు. ఉన్నది వున్నట్టు, నిజాన్ని తెలుసుకొని జాగ్రత్తగా నడచుకొమ్మని, మసలుకొమ్మని సందేశం, సమాచారమివ్వడానికే చెప్పేది. ఈపాటికే అర్ధమైపోయి ఉంటుంది నేను కరోనా గురించి చెబుతున్నానని. నిజం. ఆ మహమ్మారి మెల్ల మెల్లగా ప్రపంచమంతా పాకడం, ప్రభుత్వాలను పడగొట్టడం, చావు తప్పి కొందరికి కన్ను లొట్టపోవడం ఈపాటికే చేసింది. దాని పని అది చేసుకుపోతోంది. మనమే మనం చేయవలసినది చేస్తున్నామా లేదా అని, చేస్తుంటే ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో, చేయకపోతే ఇప్పటి నుండైనా మొదలు పెట్టాలి. ఇప్పుడు మనం క్రాస్‌ రోడ్డులో వున్నాం, రహదారి కూడలిలో వున్నాం. ఎటు పోవాలో నిర్ణయించుకోవలసింది మనమే. మన తరం కోసం, రానున్న తరాల కోసం.
ఈ మధ్య ఒకరోజు ఉదయాన్నే కూరగాయలు ఇంకొన్ని రేషన్‌ సరుకులు తెద్దామని మెయిన్‌ రోడ్డెక్కాను. మూతికి మాస్కు లేకుండా ఆటో నిండా జనం పోవడం కంట పడింది. ఇక అందరినీ గమనించడం మొదలు పెట్టాను. నేను మాస్కు పెట్టుకొనే పోయానన్న విషయం మీకు అర్థమైపోయింటుంది. కూరగాయల దగ్గర నన్ను రాసుకుంటూ నిలబడ్డాడో అసామి. భౌతిక దూరం ఊసే లేదు. మూతికి మాస్కు లేదు. కూరగాయలు తీసుకుపోవడానికి చేతిలో సంచి లేదు. ప్లాస్టిక్‌ కవర్లు రెండింటిలో తీసుకుపోయాడు. పోతూ పోతూ ఒక షాపు దగ్గర ఆగి జనాల మీదికి పొగ వచ్చేలాగ మరీ సిగరెట్‌ ఊదేసి మరీ పోయాడు. ప్రతి ఐదుగురిలో ముగ్గురికి మాస్కు లేదు. ఇంతకు ముందు ఎరుపు జోన్‌లో ఉన్న మా ప్రాంతం తరువాత ఆకుపచ్చ జోనుగా మారింది. అప్పుడు అందరూ జాగ్రత్తగానే వున్నారు. మరి ఈ మార్పుకు కారణమేమి? కరోనా భయానికి అలవాటు పడ్డారా, కరోనా ఇక రాదనే నిర్ణయానికి వచ్చారా, ఎదో ఒకరోజు ధైర్యంగా చచ్చేదానికి బదులు భయపడుతూ రోజూ చస్తూ బతకాలా అన్న నిర్ణయానికొచ్చారా ఇలా ఆలోచిస్తూ వస్తున్నాను.
అఖిల భారత వైద్య సంస్థ, ఎయిమ్స్‌ డైౖరెక్టరు కరోనాకు వ్యాక్సిను 2022లో మాత్రమే రాగలదన్నారు. ఈలోగా రష్యా నుండి రెడ్డి ల్యాబ్స్‌ వారికి వ్యాక్సిన్‌ వచ్చినట్టు వీడియో కనిపించింది. అది మూడు దశల వరకే పని చేస్తుందని ఒక ఫార్మా మిత్రుడు చెప్పాడు. ఫైజర్‌ కంపెనీది కూడా త్వరలో వస్తుందంటున్నారు. ఇంకొన్ని ప్రయోగ దశలో వున్నాయని సమాచారం. ఈలోగా బడులు తెరిచారు. కొందరు విద్యార్థులకు, ఇంకొంతమంది ఉపాధ్యాయులకు ఒకరి నుండి ఒకరికి వైరసు సోకిందని సమాచారం. దాదాపు వేయి మందికి వచ్చినట్టు వార్తలు. ప్రాణం కంటే విద్యా సంవత్సరం ఎక్కువేమీ కాదని అందరూ చెబుతున్నారు. కొందరు టీచర్లు కరోనాతో మరణించారు కూడా. ఇప్పుడే ప్రభుత్వం, ప్రజలు, సామాజిక సేవా సంఘాలు, సైన్సు సంస్థలు, ఇంకా ప్రజలకు మేలు చేయాలన్న ప్రతి ఒక్కరూ కూచొని అసలైన పరిస్థితిని అంచనా వేయాలి. మహమ్మారిని దీటుగా ఎదుర్కోవడానికి ఏమేం చేయాలో అవి చేయాలి.
శానిటైజర్లు, హ్యాండ్‌ వాషులు, హైపోలు, మాస్కులు, సబ్బుల వ్యాపారాలు బాగా పెరిగాయి. వైద్యం కూడా చిన్న వ్యాపారం కానట్లు కోట్లు రాబడుతోంది. ఉచితంగా సమాజ సేవ చేసే వారున్నారు కాని మిగతా వారంతా అలా వుండరు కదా. మందు షాపులు వద్దన్నా తెరిచారు. పేకాట రాయుళ్ళు తమ వంతు బాధ్యతగా ఈ కరోనాని సమాజం పైకి వెదజల్లుతున్నారు. ఇక బాధ్యతాయుతంగా వున్న యువత ఒకలాగ, ఏదీ పట్టని యువత మాస్కులు కూడా లేకుండా తిరగడం చూస్తూనే వున్నాం. పెళ్ళిళ్ళు, పుట్టిన రోజులు, ఇతర సంబరాలు పెరిగి పోతున్నాయి. నగలపై, ఖరీదైన వస్త్రాలపై ఉన్న ధ్యాస మాస్కు వాడడం, శానిటైజర్లు పెట్టడం లాంటి కనీస జాగ్రత్తలు పాటించడంపై లేదు. ఇంకో వైపు మాల్స్‌ తెరిచారు. సినిమా షూటింగులు కూడా మొదలు పెడుతున్నారు. రాజకీయ వైరసు పూర్తిగా పట్టిన వాళ్ళు ఎన్నికలకై ఆరాటపడుతున్నారు. కొన్ని చోట్ల నిర్వహించేశారు కూడా. ఎన్నికల్లో గెలుపు ఓటములపై వున్న ధ్యాస వాళ్ళకి కరోనా కట్టడిపై లేదు. ఆ ఎన్నికల వల్ల పెరిగిన కరోనా గురించి ఒక్క మాటా చెప్పరు. ఇక ఆర్‌.టి.సి బస్సుల్లో, ఆటోలలో పరిస్థితి చూస్తే కరోనాను ప్రపంచంలో లేకుండా చేశామన్నట్లు కనీస భయం కూడా లేకుండా తిరుగుతున్నారు జనాలు.
ఇప్పటి దాకా ఒక ఎత్తు. ఇక పై రానున్న రెండవ దశ ఒక ఎత్తు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అధికారులు, ప్రభుత్వాలు, మునిసిపాలిటీలు, పోలీసులు చేయవలసిన పని మనం చేయాలి. అదేనండీ జాగ్రత్తలు చెప్పడం. ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. మన బాధ్యతలో మనముండాలి. ఇది మానవులందరికీ సంబంధించింది. రెండో దశ ఎలా ఉంటుంది అని చెప్పలేకపోయినా మానవుడు అజాగ్రత్తగా ఉంటే మాత్రం మొదటి దశ కంటే భయంకరమైన అనుభవాలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరే ఆలోచించండి. మీరే నిర్ణయం తీసుకోండి....''

అక్కడ కూచున్న వాళ్ళంతా తమ మెదళ్ళకు పని కల్పిస్తున్నారు.
''విన్నారా మానవుడి మాటలు. అతడే నా బలం, అతడే నా బలహీనత. అతడి తెలివిపై ఎంత భయముందో, అతడి మూర్ఖత్వంపై అంత విశ్వాసముంది నాకు'' అని ముందుకు పోయింది కరోనా.
''చూద్దాం ఇది గెలుస్తుందో, మరి మానవులు నిద్ర మేలుకుంటారో. మేలుకుంటే కరోనాకు సమాధి కడతారు. లేదంటే తమ వాళ్ళ సమాధుల్ని పెంచుకుంటారు. సరే నాకు నిద్ర వస్తోంది పడుకుంటాను'' అని ఓ సీనియర్‌ వైరసు మసూచి సమాధిపై స్థలం శుభ్రం చేసుకొని నిద్రకు ఉపక్రమించింది.
ఇక మిగిలింది మానవులు నిద్ర లేవడం, మెలకువతో ఉన్నవాళ్ళు పనిలోకి దిగడం. మానవులపై వైరసులకున్న భయం, నమ్మకం గమనిస్తే మానవులదే విజయం కావచ్చు. ఏమీ చేయకుండా ఏమీ కాదన్న మూఢ నమ్మకం వీడి వాస్తవంలో శాస్త్రీయంగా అడుగెయ్యాలి. చూద్దాం.....!?
- జంధ్యాల రఘుబాబు - సెల్‌ : 98497 53298