ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : ఎస్సీ ఎస్టీలు దేవాలయాల్లోకి రాకుండా అడ్డుకునే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హెచ్చరించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎస్పీ మాధవరెడ్డి, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అట్రాసిటీ చట్టంపై ఎస్సీ ఎస్టీ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు. 15 రోజులలోపు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని సేకరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలకు శ్మశాన వాటిక కోసం అవసరమైన స్థలాలను సేకరించాలన్నారు. ప్రతినెల ఆయా మండలాల పరిధిలోని ఒక గ్రామంలో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని అందుకు ఆర్డీవో, తహశీల్దార్లు బాధ్యత వహించి కమిటీ సభ్యులకు ముందుగా తెలపాలన్నారు. అంతకుమునుపు మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీల అభ్యున్నతకి కమిటీ కృషి చేయాలన్నారు. అంబేద్కర్ భవన నిర్మాణం, శ్మశాన వాటికలు త్వరగతిన పూర్తిచేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. విజిలెన్స్ మరియు మానిటరింగ్ సభ్యులు మాట్లాడుతూ శ్మశాన వాటికలు చాలా గ్రామాల్లో లేనందున సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఆ వర్గాల ప్రజలు సమస్యలపై అధికారుల వద్దకు వచ్చినప్పుడు సత్వరమే పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శివరంగ ప్రసాద్, ఆర్డీవోలు భాగ్యరేఖ, తిప్పే నాయక్, సిపిఒ విజరు కుమార్, డీఎస్పీలు వాసుదేవన్, శ్రీలత, వరప్రసాద్, శ్రీనివాసులు, హుస్సేన్ పీరా, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, ఎస్టీ సంక్షేమ అధికారి మోహన్ రావు, కమిటీ సభ్యులు నరసింహమూర్తి, వెంకటేశు, గంగులయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.










