ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ వైసిపి అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు అధికమయ్యాయని టిడిపి వడ్డే సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్, టిడిపి బీసీ సెల్ జిల్లా అధ్యకుడు రంగయ్య అన్నారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అగ్రవర్ణా లకు చెందిన అధికార పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో బీసీలను అణగదొక్కాలనే ఉద్దేశంతో దాడులు చేయడంతోపాటు వారిని తీవ్రంగా గాయపరుస్తున్నారన్నారు. అంతటితో ఆగకుండా దెబ్బలు తిన్నవారిపైనే పోలీసు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా ధర్మవరం మండలంలో బోయ కులానికి చెందిన వారిని దారుణంగా హత్య చేశారని గుర్తు చేశారు. అలాగే కుణుతూరులో టిడిపి కార్యకర్త వడ్డే ఆదినారాయణను అదేగ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు దారుణంగా దాడి చేసి గాయపరిచారన్నారు. తిరిగి పోలీసులు ఆదినారాయణపై 307 కేసు కట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి బీసీలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కురుబ సాధికారసమితి జిల్లా అధ్యక్షుడు రమణ, వడ్డెర సాధికార సమితి జిల్లా అధ్యకుడు పల్లపు రవీంద్ర, బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిది వడ్డే నాగేంద్ర, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యకులు కేశళ్ల శ్రీనివాసులు, టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి సాహెబ్బీ, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు విజరుకుమార్ నాయక్, కురుబ సాధికార రాష్ట్ర కార్యదర్శి నీల్లపాల రాజగోపాల్, కురుబ రాష్ట్ర డైరెక్టర్ రాగేమురళి, బీసీ సెల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బీరన్న, టిడిపి సీనియర్ నాయకుడు ఫణికుమార్, తదితరులు పాల్గొన్నారు.
విలేఖరులతో మాట్లాడుతున్న టిడిసి వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్, నాయకులు










