Dec 22,2022 20:58

జెసికి వినతిపత్రం ఇస్తున్న ఎంఆర్‌పిఎస్‌, ఎంఎస్‌పి నాయకులు

ప్రజాశక్తి - రాయచోటి : ఎస్‌సి వర్గీకరణకు ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలని ఎంఎస్‌పి నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎంఎస్‌పి జాతీయ నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో మహాదీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలకు ఇచ్చిన హామీని ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన 15 శాతం రిజర్వేషన్లు ఒక వర్గం వారే దోచుకుంటున్న దరిమిలా 28 ఏళ్లుగా వర్గీకరణ కొరకు పోరాటాలు చేస్తూనే ఉన్నామని తెలిపారు. ఎస్సీలలోని మాదిగ మాదిగ ఉప కులాలు విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, సంక్షేమ రంగాలలో వెనుకబాటును గుర్తించి బిజెపి వెంటనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్‌, ఎంఎస్‌పి నాయకులు తిరుపాల్‌, నారాయణ, సుబ్బయ్య, బద్రి, ఈశ్వరయ్య, రామానుజులు, శివయ్య, శంకర, శ్రీను, సాయి, బాలాజీ, సురేష్‌ బాబు, వెంకటేష్‌ పాల్గొన్నారు.