Oct 28,2023 23:34

సీఐపై చర్యలు తీసుకోండి..

సీఐపై చర్యలు తీసుకోండి..
శ్రీకాళహస్తి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ వద్ద టీడీపీ ధర్నా
ఎస్పీ హామీతో శాంతించిన తమ్ముళ్లు
ప్రజాశక్తి- శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి గ్రామీణ సీఐ అజరు కుమార్‌ పై శాఖా పరంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి డిమాండు చేశారు. శ్రీకాళహస్తి గ్రామీణ సీఐ అజరు కుమార్‌ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ టీడీపీ నాయకులు శనివారం గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద సుమారు నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించారు. సీఐ అజరుకుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా టీడీపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించి నందుకు నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇటీవల 'సైకో పోవాలి' నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశారన్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి మండలం కమ్మకొత్తూరులో స్థానికులతో కలసి టీడీపీ శ్రేణులు నిరసన చేశారన్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ అజరుకుమార్‌ తన సిబ్బందితో కమ్మకొత్తూరుకు వెళ్లి నిరసన చేసిన వారిని చితకబాదారన్నారు. నిరసనతో సంబంధం లేకుండా కమ్మకొత్తూరుకు చెందిన చెంచయ్యనాయుడు అనే వద్ధుడు చెత్త కాల్చుతుంటే అతనిని కూడా సీఐ చితక బాదడంతో పాటు బూట్ల కాళ్లతో తన్నారన్నారు. వద్ధాప్యంలో ఉన్న చెంచయ్యనాయుడు లేవలేక కూర్చుని సీఐకు సమాధానం చెప్పినందుకు ఆయన మరింత రెచ్చిపోయి బూతులు తిట్టడంతో పాటు ఆ వద్ధుని విపరీతంగా కొట్టారన్నారు. అంతేగాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తే అంతుచూస్తానని కమ్మకొత్తూరు గ్రామస్థులను సీఐ బెదిరించారన్నారు. కమ్మకొత్తూరు సంఘటన గురించి తాను సీఐను అడిగినందుకు తనను కూడా చెప్పలేని విధంగా పరుష పదజాలంతో దూషించారని బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి ఆరోపించారు. రాజకీయ పార్టీల నేతలు తనను ఏమీ చేయలేరని, పోలీస్‌స్టేషన్‌ వద్దనే తాను ఉంటానని వచ్చి ఏం పీకుతావో అని సీఐ సవాల్‌ విసరడంతో తాము ఇక్కడకు వచ్చామన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే పోలీస్‌స్టేషన్‌ నుంచి బయటకు వచ్చి తాము ఏం పీకుతామో చూడాలన్నారు. సీఐ పోలీసు యూనిఫాం వేసుకుని వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడని వెంకట సుధీర్‌రెడ్డి ఆరోపించారు. సిఐపై చర్యలు తీసుకునే వరకు తాము ఇక్కడ నుంచి కదలమని భీష్మించుకున్నారు. టీడీపీ శ్రేణులు చేపట్టిన ధర్నా తీవ్రతరం కావడంతో శ్రీకాళహస్తి డీఎస్పీ భీమారావు, సీఐలు మల్లిఖార్జున, విక్రమ్‌, అంజూ యాదవ్‌తో పాటు ఎస్‌ఐలు, పోలీసులు పెద్దసంఖ్యలో గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. వీరంతా బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డితో చర్చించారు. అయినా ఆయన ధర్నా విరమణకు అంగీకరించలేదు. తమకు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి హామీ ఇస్తే ధర్నా విరమిస్తామన్నారు. దీంతో పోలీసులు ఈ విషయం ఎస్పీ దష్టికి తీసుకెళ్లారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెంటనే వెంకట సుధీర్‌ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. కమ్మకొత్తూరులో జరిగిన సంఘటనతో పాటు మరికొన్ని సంఘటనలపై విచారణ జరిపి సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన విరమించారు. ఈ ధర్నాలో టీడీపీ నేతలు రంగినేని చెంచయ్య నాయుడు, తాటిపర్తి రవీంద్రనాథరెడ్డి, రావిళ్ల మునిరాజా నాయుడు, చక్రాల ఉష, కాసరం రమేష్‌, వజ్రం కిషోర్‌, సుబ్బయ్య, రేణుకమ్మ పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.