May 04,2022 08:09
  • మొత్తం డిమాండ్‌లో 5 శాతం
  • పొదుపు చర్యలు అవశ్యమన్న ఎపిఎస్‌ఇసిఎం సిఇఓ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఏటా విద్యుత్‌ వినియోగ డిమాండ్‌ పెరగ టానికి ఎసిలు అధికంగా వినియోగం ఒక కారణమని రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఎపిఎస్‌ఇసిఎం) అభిప్రాయ పడింది. ఎసిల వినియోగ డిమాండ్‌ ఏటా మూడు వేల మిలియన్‌ యూనిట్‌లుగా ఉంటోందని అంచనా వేసింది. ఇది రాష్ట్ర మొత్తం విద్యుత్‌ డిమాండ్‌లో ఐదు శాతంగా ఉన్నట్లు తెలిపింది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ విద్యుత్‌ కొరత నెలకొన్న నేపథ్యంలో విద్యుత్‌ వృధాను అరికట్టాల్సిన అవసరం ఉందని ఎపిఎస్‌ఇసిఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఓ) ఎ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పెరుగుతున్న వేసవి ఎండలు, విద్యుత్‌ వినియోగం, పొదుపు చర్యలపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎసిలను నిర్ధిష్టమైన ఉష్ణోగ్రతలో వినియోగించితే గణనీయంగా విద్యుత్‌ను ఆదా చేయవచ్చన్నారు. దీనివల్ల సహజ వనరు లను పరిరక్షించడంతోపాటు హానికరమైన ఉద్గారాల ప్రభా వం నుంచి మానవ శరీరాన్ని రక్షించుకోవడం సులభతర మని పేర్కొన్నారు. ఎసిలను 24 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉష్ణోగ్రతను సెట్‌ చేసుకుంటే విద్యుత్‌ పొదుపుతోపాటు ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాకుండా ఆర్థికంగా వెసులు బాటు కలుగుతుందన్నారు. ఎసిని 24 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వాడటం వల్ల దేశంలో ఏటా రూ.10 వేల కోట్ల విలు వైన 20 బిలియన్‌ యూనిట్‌ల ఇంధనం ఆదా అవుతుంద న్నారు. ఒక ఎసిని రోజుకు ఎనిమిది నుంచి పది గంటల పాటు వినియోగిస్తే పది కిలోల కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుందని, ఇది వాతావరణ మార్పులకు ప్రధాన సవాల్‌గా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎసి ఉన్న గది ఒక డిగ్రీ సెల్సి యస్‌ ఉష్ణోగ్రతను పెంచితే ఆరు శాతం విద్యుత్‌ను పొదుపు చేయవచ్చన్నారు. అదే 20 నుంచి 24 డిగ్రీల సెల్సియస్‌కు ఎసిల ఉష్ణోగ్రతను సెట్‌ చేస్తే 24 శాతం విద్యుత్‌ ఆదా అవు తుందని తెలిపారు. రాష్ట్రంలో నేడు విద్యుత్‌ కొరత నెలకొన్న పరిస్థితుల్లో, పొదుపు చర్యలు పాటించడం వల్ల వారంలో 24 గంటలపాటు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇది విద్యుత్‌ వినియోగాన్ని కొంత మేరకు తగ్గించి, కొరతను అధిగమించడంతోపాటు డిస్కమ్‌లకు దోహదపడుతుందని తెలిపారు. గృహ వినియోగదారులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, మాల్స్‌, హోటల్స్‌, ఎయిర్‌పోర్టుల లోనూ ఎసిల వినియోగంపై అవ గాహన కల్పించేందుకు ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు పలు పొదుపు చర్యలను చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు.

  • వేడిగాలి ఇంట్లోకి రాకుండా ఉండేలా కిటికీలు, కర్టెన్లను విధిగా మూసి ఉంచాలి
  • ఇంట్లోకి ఉష్ణోగ్రతలు రాకుండా నిరోధించాలి
  • ఎయిర్‌ ఫిల్టర్లను నెల నుంచి మూడు నెలల్లోగా శుభ్రపరచాలి లేదా వాటిని మార్చడం వల్ల ఎసి యూనిట్‌లో గాలి సజావుగా కదులుతుంది.
  • గది నుంచి బయటకు వచ్చే సమయంలో లైట్లు, ఫ్యాన్‌లు, ఎసిల స్విచ్‌లను ఆఫ్‌ చేయాలి. అలాగే టివి చూసిన తర్వాత రిమోట్‌ ఆఫ్‌ చేసినా, పవర్‌ స్విచ్‌ను కూడా ఆఫ్‌ చేయాలి.
  • మొబైల్‌ చార్జర్లను సాకెట్‌ నుంచి పూర్తిగా అన్‌ప్లగ్‌ చేయాలి, లేదా కనీసం స్విచ్‌ను ఆఫ్‌ చేయాలి.
  • సమర్థ విద్యుత్‌ పొదుపు కోసం వీలైనంత వరకు సీలింగ్‌ ఫ్యాన్‌లను ఉపయోగించాలి.