Mar 29,2023 20:43

ఎసిబికి చిక్కిన విఆర్‌ఒ

రైల్వేకోడూరు : పట్టణంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులోని ఎల్‌ఐసి కార్యాలయం సమీపంలో ఎసిబి అధికారులు దాడులు జరిపి ఓబనపల్లె విఆర్‌ఒ జి.ఏసుదాసును లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు ఎసిబి డిఎస్‌పి పి.కంజాక్షన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబనపల్లె గ్రామానికి చెందిన కాంట్రాక్టర్‌ కస్తూరి ఓబయ్య నాయుడు పంచాయతీలోని పిచ్చయ్య కుంట, పెద్దకుంట, మర్రికుంట ప్రాంతాలలో చేసిన కాంట్రాక్టు పనులకు సంబంధించి బిల్లుల కోసం ఇరిగేషన్‌ శాఖ కోరిన విధంగా రెవెన్యూ శాఖ వద్ద ఒక సర్టిఫికెట్‌ అవసరమని గత ఏడాదిగా విఆర్‌ఒ ఏసుదాసును కోరుతున్నారని పేర్కొన్నారు. అతను రూ.20 వేలు లంచం అడిగాడని ఓబయ్య నాయుడు ఫిర్యాదు చేశారని చెప్పారు. విఆర్‌ఒ ఏసుదాసును వల పన్ని పట్టుకున్నామన్నారు. తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దారు రామ్మోహన్‌ ఆధ్వర్యంలో విఆర్‌ఒ ఏసుదాసును విచారించామని తెలిపారు. కార్యక్రమంలో ఎసిబి సిఐలు కె.ఎల్లమరాజు, కృష్ణమోహన్‌, మహమ్మద్‌ అలీ, నరేష్‌ పాల్గొన్నారు.
- విఆర్‌ఒను విచారిస్తున్న ఎసిబి అధికారులు