ప్రజాశక్తి-హిందూపురం : ఈ నెల 13నుంచి 16వరకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఎస్‌ఎఫ్‌ఐ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాల వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ మహసభల పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబావలి మాట్లాడుతూ ఈ మహాసభలలో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పై చర్చిస్తామన్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా వ్యతిరేక విధానమైన నూతన జాతీయ విద్యా విధానంపై ఈ మహాసభలలో చర్చించి పోరాటానికి రూపకల్పన చేస్తారన్నారు. ఈ అఖిలభారత మహాసభలను విద్యార్థులు, మేధావులు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భగత్, అభి, చంద్రశేఖర్, రంగ, వీరేష్, బాబా ఫక్రుద్దీన్, గురుశాంత్, మారుతి, నవీన్, రఘు, రవితేజ, భరత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.










