ప్రజాశక్తి-పెనుకొండ : మండలంలోని తిమ్మాపురంలో దళిత భూముల విషయంలో జోక్యం చేసుకున్న ఎస్‌ఐ రమేష్‌బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామ దళితులు బుధవారం స్థానిక పోలీసుస్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు ఎస్‌ఐకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా సిపిఎం నాయకులు రమేష్ మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులకు చెందిన 11, 21, 12 లెటర్‌లోని 1.94 ఎకరాల భూమి విషయంలో న్యాయం చేయాలని ఎస్‌ఐకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఎస్‌ఐ తమ ఫిర్యాదు తీసుకోకుండా తమపై దౌర్జన్యం చేస్తు, అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేస్తే స్థానిక స్టేషన్ కలవాలని సూచించారన్నారు. దీంతో మళ్లీ వచ్చి ఎస్‌ఐను కలిస్తే 'దిక్కున్న చోట చెప్పుకో' అంటూ దౌర్జన్యం చేయడంతో పాటు అక్రమ కేసులు పెడుతామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తమకు న్యాయం జరగక పోతే ప్రజా సంఘాలను కలుపుకుని డిఎస్‌పి కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో దళితులు పాల్గొన్నారు.










