Apr 28,2022 07:32

 గతేడాది కంటే ఎక్కువే
 రేట్ల పెంపుదలకు అనుగుణంగా సబ్సిడీ ఇవ్వని కేంద్రం
 ఖరీఫ్‌ రైతుపై అదనపు భారం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి -  అమరావతి : 
ఖరీఫ్‌లో ఎరువుల ధరలు భారీగా పెరగనున్నాయి. ఎరువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్రం సబ్సిడీ ఇవ్వకపోవడంతో గత ఖరీఫ్‌ కంటే, నిన్న మొన్నటి రబీ కంటే సైతం రేట్లు పెరగనున్నాయి. 2022-23 ఖరీఫ్‌ కోసం సూక్ష్మ పోషకాల ఆధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్‌) పాలసీని కేంద్రం బుధవారం ప్రకటించింది. నైట్రోజన్‌ (ఎన్‌), ఫాస్పరస్‌ (పి), పొటాష్‌ (కె) కాంబినేషన్‌ ఎరువులకు ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇచ్చేదీ నోటిఫై చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు డిఎపి, ముఖ్యమైన కాంప్లెక్స్  ఎరువుల  రేట్లు గడచిన ఖరీఫ్‌, రబీలో కంటే పెరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం సబ్సిడీ ఇచ్చాక డిఎపి బస్తా ఎంఆర్‌పి రూ.1,350 ఉండబోతోందని ఎరువుల కంపెనీలు చెబుతున్నాయి. గత ఖరీఫ్‌, రబీలో డిఎపి ఎంఆర్‌పి రూ.1,200 ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ధర పెరగకుండా చూసింది. రబీ పూర్తవడంతోనే ఏప్రిల్‌ ఒకటి నుండి కంపెనీలు డిఎపి రేటు రూ.1,350 చేశాయి. గత ఏడాది కంటే సబ్సిడీ పెంచినట్లు కనిపిస్తున్నా రైతులకు అదే రూ,1,350 పడుతుందంటున్నారు. ఏతావాతా గత సీజన్‌ కంటే రైతులు బస్తాపై రూ.150 అదనంగా పెట్టుకోవాలి. ఖరీఫ్‌లో రాష్ట్ర రైతులు 2.5 లక్షల టన్నుల డిఎపి వాడతారు. నిరుడు కంటే రైతులపై రూ.75 కోట్ల అదనపు భారం పడుతుంది. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరుగుతుండటం వలన ధరలు పెంచాల్సి వస్తోందని చెబుతున్న కంపెనీలు, వ్యూహాత్మకంగా ఏప్రిల్‌కు ముందే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు రూ.నాలుగైదొందల వరకు దశల వారీగా పెంచాయి. కేంద్రం గతేడాది కంటే పి, కె ఎరువులకు సబ్సిడీ పెంచింది. అయితే కంపెనీలు పెంచిన ధరలకు సమానంగా రాయితీ ఇవ్వలేదు. దాంతో ముందటి ఖరీఫ్‌, రబీలో ఉన్న ధరల కంటే ఎక్కువే ఉంటాయంటున్నారు. 10-26- రకం రూ.1,470 వరకు ఉండొచ్చని చెబుతున్నారు. గతేడాది కంటే ఈ ధర ఎక్కువే. 20-20- రకం ధర ప్రస్తుతం రూ.1,470 ఉండగా రూ.1,350 కావొచ్చని అంచనా. అలాగే 14-35-14 ధర రూ.1,900పైన ఉండగా కేంద్ర పాలసీ అనంతరం రూ.1,400 కావొచ్చని చెబుతున్నారు. కాగా కేంద్రం ఎరువులకు సబ్సిడీ పెంచిందని, దాంతో ఎరువుల ధరలు తగ్గుతాయని ప్రభుత్వ అనుకూల వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. శ్రీలంక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చర్యలు చేపట్టిందనీ చెబుతున్నాయి.