మాట్లాడుతున్న వైసిపి నాయకులు ఆనం విజయకుమార్‌రెడ్డి
ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు...
-తిరుగుబాటు ఎంఎల్‌ఎలపై ఆనం విజరు విమర్శల వర్షం
నెల్లూరు:వైకాపా పార్టీ పై తిరుగుబాటు ప్రకటించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై,వెంకటగిరి ఎంఎల్‌ఎ తన సోదరుడు అయిన ఆనం రామనారాయణరెడ్డి పై ఆనం విజరుకుమార్‌రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ,ఆనం విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ మాట్లాడుతూ పార్టీ వదిలి వెళ్ళిపోవాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు.. అయితే ' ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు' అన్న చందంగా కేవలం తమ స్వలాభాల కోసం పార్టీ గుర్తుతో గెలిచి కోట్లు సంపాదించి పేరు సంపాదించుకొని పార్టీని పార్టీ నాయకుడిని తిడుతూ వెళ్లిపోవడం అంటే అన్నం పెట్టిన చేతిని కొరికినట్టే .. వారు బాగుపడరు అంటూ
తీవ్ర విమర్శలు చేస్తూ మరిన్ని కోణాలలో ఇద్దరు ఎమ్మెల్యేల పై విరుచుకుపడ్డారు. రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఉద్ధేశించి మాట్లాడుతూ పెద్దన్న.. పెద్దన్న అంటూ తమ చుట్టూ తిరిగిన విషయాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో పాత స్కూటర్ పై తమ వద్దకు వచ్చే కోటంరెడ్డి ఎప్పటి నుంచి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి కోట్లు రూపాయలు సంపాదించాడనీ ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రౌడీ షీటర్లకు, బ్లేడు బ్యాచులకు నెల జీతాలు ఇస్తూ పార్టీ కార్యాలయం లో పోషిస్తూ ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ రూరల్ నియోజకవర్గంలో బిచ్చగాడి దగ్గర నుంచి ప్రతి అంగడి వాళ్ళ దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. వీరి ఆగడాలు మితిమీరిపోయాయని ఎంతోమంది తన దగ్గర చెప్పుకుని బాధపడ్డారని అయినా మేము ఎక్కడ బయట చెప్పలేదని కేవలం పార్టీ అధిష్టానం వద్ద వాస్తవాలు వివరించామన్నారు. వీరి ఆగడాలు ఎంతగా మితిమీరిపోయాయంటే గ్రామాల్లోకి వెళ్లి రైతులను భయపెట్టడం భూములు, ఇల్లు సరిగా ఉన్నాయని బెదిరించడం లాక్కోవడం వరకు వెళ్లాయన్నారు. చివరకు విలేకరులపై దాడి చేయించడం.. ప్రజలను బాధించడం.. ఉద్యోగస్తులును బెదిరించడం సర్వసాదారణం అయిపోయిందన్నారు. మాట వినని వారిని చంపేస్తాము అని బెదిరింపు చర్యలకు పాల్పడుతు పార్టీకి ఎంతో చెడ్డ పేరు తీసుకువచ్చినా ఇప్పటివరకు పార్టీ ఎప్పుడూ కోటంరెడ్డి పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఒకప్పుడు కార్పొరేటర్ సీటు కూడా దక్కించుకోలేని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎంత మంది వద్దన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ టికెట్ ఇచ్చి రెండు సార్లు గెలిపించుకున్నారన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టే పరిస్థితికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చారంటే వీరు బాగుపడరని, పార్టీ అన్ని ఇచ్చినా పార్టీకి నువ్వేమిచ్చావని పార్టీ మారిపోవాలని ముందే నిర్ణయించుకుని ఫోన్ ట్యాపింగ్ కథలతో పార్టీపై విమర్శలు చేస్తున్న కోటంరెడ్డి బాధపడే రోజు తొందరలోనే వస్తుందని ఆనం విజరు కుమార్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఇక తన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన చూడని పదవులా.. సిఎం పదవి దగ్గర దాకా వెళ్లి వచ్చిన వ్యక్తి అని , రాజశేఖర్ రెడ్డి హాయంలో ఆత్మకూరు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కోట్లాధి రూపాయలు నిధుల కేటాయించారన్నారు. అటువంటి వ్యక్తి కుమారుడు కనిపిస్తే ముఖం చాటేస్తావా.. వద్దు అని అంటున్నా టిడిపిలోకి వెళ్లావు.. అక్కడ అవమానపడి ఇంటిలో ఉంటే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలిచి పార్టీ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. తీరా గెలిచిన తరువాత జిల్లా నుంచి కాకాణి గోవర్థన్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్టే ఆయనతో గోడవపడ్డాడని, కేవలం స్వార్ధం కోసమే అందరితో గోడవపడ్డాడన్నాడు. ఇపుడు కూతురు కైవల్య కు ఆత్మకూరు సీటు కావలి కోరాడు.. అమ్మాయి కడప జిల్లా అక్కడే పోటీ చేసుకోవాలి..మీ మనసు లో వున్న చెడు ఆలోచన లే మిమ్మల్ని నాశనం చేస్తాయని జోస్యం చెప్పారు. పబ్లిక్ మీటింగ్ లలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది గొప్పా,మేము రూరల్ లో జరిగే అన్యాయాల మీద ఎప్పుడూ మేము బహిరంగ గా మాట్లాడలేదే అని అన్నారు. జడ్‌పి చైర్మన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఎటువంటి సమస్య ఉన్న తమను సంప్రదించవచ్చని,ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని పార్టీ తరఫున ఎటువంటి అవసరం వచ్చినా వెంటనే తమను సంప్రదించవచ్చని రూరల్ ప్రజలకు తెలియజేశారు.
అనిల్ ని పొగడ్తలతో ముంచెత్తిన అనం విజరు కుమార్ రెడ్డి
వయసులో చిన్నవాడైన అనిల్ కుమార్ యాదవ్ ఎంతో నిజాయితీపరుడని పార్టీ కోసం దూకుడుగా ఉంటాడు తప్ప పార్టీకి ఏనాడు నష్టం వాటిల్లే పని చేయలేదన్నాడు. అనిల్ కుమార్ లోని సగం నిజాయితీ కోటంరెడ్డి కి గానీ ఆనం రామనారాయణ రెడ్డికి గానీ ఉన్నా ఇలా మాట్లాడరని ఆనం విజరు కుమార్ రెడ్డి తెలియ చేశారు.










