న్యూఢిల్లీ : దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుత నిరసనలు చేపడుతున్న అన్నదాతలపై పోలీసులు లాఠీ జులుం చూపించారు. మొదట శాంతియుత నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతించినా.. అడుగడుగునా రైతన్నలపై దాడులు చేశారు. దీంతో పోలీసులు, రైతులకు తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అయినప్పటికీ భద్రతా వలయాలను ఛేదించుకున్న రైతన్నలు చివరకు ట్రాక్టర్లతో ఎర్రకోటకు చేరుకున్నారు. ఎర్రకోటపై రైతన్నల జెండాను ఎగరవేశారు. అక్కడ జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు.

ర్యాలీలో భాగంగా నగరంలోకి అనుమతిలేని ప్రాంతాల్లోకి ట్రాక్టర్లు వెళ్లకుండా పోలీసులు బస్సులను అడ్డుగా ఉంచారు. దీంతో ఆందోళనకారులు బస్సులను పక్కకు నెట్టి, ముందుకుసాగారు. భద్రతాదళాలు అడుగడుగునా రైతులపై నిర్భందకాండ సాగింది. ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాల్లోకి రైతులు వెళ్లకుండా అడ్డుపడ్డారు.అటుగా వస్తున్న రైతులపై టియర్ గ్యాస్‌లను ప్రయోగించాయి. అయినప్పటికీ రైతులు చివరకు ఎర్రకోటను చేరుకున్నారు. ఓ వ్యక్తి ఎర్రకోట వద్ద రైతు జెండాను ఎగురవేశారు. అక్కడకి చేరుకున్న రైతులు సాగు చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. కాగా...అక్కడి నుండి ఖాళీ చేయాలని రైతు సంఘాలు పిలుపు మేరకు...రైతన్నలు వెనుదిరుగుతున్నారు.











