ఎర్ర జెండాను ఎవ్వరూ ఆపలేరు : సిపిఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్
ఎకె గోపాలన్ నగర్ నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : ఎర్ర జెండాను ఎవ్వరూ ఆపలేరని సిపిఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ అన్నారు. కేరళలోని కన్నూర్‌లో 23వ సిపిఎం అఖిల భారత మహాసభ ముగింపు సందర్భంగా ఆదివారం నాడిక్కడ కామ్రేడ్ ఎకె గోపాలన్ నగర్ (జవహార్ స్టేడియం)లో జరిగిన బహిరంగ సభలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. సిపిఎంకు, ఇతర పార్టీలకు స్పష్టమైన తేడా ఉందని, సిపిఎం సామాన్య ప్రజల కోసం పని చేస్తోందని పేర్కొన్నారు. మహాసభ జయప్రదం కోసం దాదాపు 4 వేల ప్రాంతీయ ఆహ్వాన సంఘాలు ఏర్పాడ్డాయని తెలిపారు. ప్రజల నుంచి, కార్మికుల నుంచి రెండు రోజుల పాటు నిధులు సేకరించామని, షాప్‌లు, ఇళ్ల వద్దకు వెళ్లి రెండు రోజుల పాటు విరాళాలు స్వీకరించామని అన్నారు. వివిధ అంశాలపై 26 సెమినార్లు నిర్వహించామని, ఒక సైన్స్ ఫెయిర్ నిర్వహించామని తెలిపారు. లక్షలాది మంది పేదలు, సామాన్యులు ఈ బహిరంగ సభకు వచ్చారని, అదే సిపిఎం గొప్పదనం అని పేర్కొన్నారు. పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాల కోసమే సిపిఎం పని చేస్తోందని, చరిత్ర నిండా పార్టీ త్యాగాలు ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలో కన్నూర్‌లో 171 మంది అమర వీరులు అయ్యారని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎస్‌డిపిఐ, ముస్లిం లీగ్ గూండాలు హత్యాకాండలో కామ్రేడ్స్ విలువైన ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు అందరూ ఏకమై ఎన్నికల్లో సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ని ఓడించేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. కానీ, సిపిఎం నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ఉన్నారని, ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టారని అన్నారు. కాంగ్రెస్ హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ హామీ ఇచ్చిందని, తాము సెమీ స్పీడ్ రైలు ప్రాజెక్టును తీసుకొస్తే, దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని విమర్శించారు. అదే ఈ ప్రాజెక్టు అదానీ, అంబానీలకు అప్పగిస్తే ప్రతిపక్షాలు వ్యతిరేకించవని, కానీ ప్రభుత్వం నిర్వహిస్తే వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. మెజార్టీ ప్రజలు సిల్వర్‌లైన్ ప్రాజెక్టును కోరుకుంటున్నారని, అందుకు తాము ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి, కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఏకమై పని చేస్తున్నాయని, ప్రజలు తమవైపు ఉన్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నాయని మీడియా ప్రచారం చేస్తోందని, దానికి భిన్నంగా మహాసభ అన్ని అంశాల్లో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని అన్నారు. పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, ప్రధాన కార్యదర్శి నివేదికలు, తీర్మానాలు అన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని వివరించారు. 'ఎన్నికల ముందు ఎల్‌డిఎఫ్‌కు 45 కంటే తక్కువ సీట్లు వస్తాయని, యుడిఎఫ్‌కు 100కు పైగా సీట్లు వస్తాయని మీడియా కథనాలు రాశాయి. కొన్ని మీడియా సంస్థలయితే బిజెపికి 35 పైగా సీట్లు వస్తాయని తెలిపాయి. కానీ అందులో ఒక్కటి కూడా నిజం కాలేదు. బిజెపికి ఒక్క స్థానం కూడా రాలేదు. కాంగ్రెస్‌కు గతం కంటే సీట్లు తగ్గాయి. మీడియా కథనాలకు భిన్నంగా ఫలితాలు వెల్లడయ్యాయి'' అని వివరించారు.










