Feb 20,2023 21:08

మాట్లాడుతున్న రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి

మాట్లాడుతున్న రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి
ఏప్రిల్‌ నుంచి కోటం రెడ్డి
''ప్రజా ఆశీస్సుల యాత్ర''
నెల్లూరు:రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనదైన శైలిలో మరో సుదీర్ఘ యాత్రకు సన్నద్ధమయ్యారు. అనుమానం.. అవమానం జరిగిన చోట తాను ఇమడలేను అని అంటూ అధికార పార్టీకి దూరంగా జరిగిన అనంతరం తన నియోజకవర్గం ప్రజలతో సంబంధాలు మరింత బలపడటమే లక్ష్యంగా ఏప్రిల్‌ నుంచి ప్రజా ఆశీస్సుల యాత్రను ఆయన ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నగరంలోని రూరల్‌ ఎంఎల్‌ఎ కార్యాలయంలో తన ముఖ్యఅనుచరులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాను నిర్వహించబోనున్న 'ప్రజా ఆశీస్సుల యాత్రకు సంబంధించి పలు అంశాలను ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. అతి త్వరలో నిర్వహించనున్న ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొన్న అనంతరం సుదీర్ఘంగా 141 రోజులు పాటు ఈ యాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. ఈ యాత్ర రూరల్‌ పరిధిలోని అర్బన్‌ ప్రాంతాల తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం నిరాటంకంగా ఈ యాత్ర కొనసాగనించనున్నారు.

141 రోజులు సాగే ఈ యాత్రలో ప్రజల నివాసంలోనే భోజనం చేసి అక్కడే బస చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ వేగవంతంగా, పక్కాగా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించిన రోడ్లు, కాలువలు, పొట్టేపాళెం ప్రాంతంలోని కలుజుపై వంతెన నిర్మాణం, బి.సి భవన్‌ నిర్మాణం, అంబేద్కర్‌ భవన్‌ నిర్మాణం వంటి వివిధ ప్రజా సమస్యలపై ఈనెల 25న ఆందోళన కార్యక్రమం, అనంతరం మార్చిలో శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతర కార్యక్రమం ముగిసిన వెంటనే ఈ సుదీర్ఘ యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. తాను చేస్తున్న కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు కలిసి వచ్చిన ప్రాంతం అయినటువంటి రూరల్‌ పరిధిలోని 25వ డివిజన్‌ నుంచి ఈ యాత్రను మొదలు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూరల్‌ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల బాగోగులు తెలుసుకోవడంతో పాటు వారి ఆశీస్సులను అందుకోవటమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికను దష్టిలో ఉంచుకొని నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో మరింత బలపడటమే లక్ష్యంగా రూరల్‌ ఎంఎల్‌ఎ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.